తుంగతుర్తి, నవంబర్ 18 : పాలకుల మోసపూరిత వాగ్దానాలను ఎండగడుతూ, పెట్టుబడిదారి వ్యవస్థ దోపిడిని ఎప్పటికప్పుడు బహిర్గతపరుస్తూ దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలను చైతన్యం చేసేదే కళ అని ప్రజానాట్య మండలి సూర్యాపేట జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న అన్నారు. మంగళవారం తుంగతుర్తిలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన పీఎన్ఎమ్ డివిజన్ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజానాట్య మండలి 1943లో స్థాపించబడి నేటికీ 80 సంవత్సరాలు అవుతున్నదన్నారు. అవిశ్రాంత ప్రస్థానం ప్రజానాట్య మండలి అత్యధిక సాంస్కృతిక బృందాలు ప్రజా కళా సైన్యంతో ఇది నడుస్తుందని తెలిపారు. ప్రజానాట్య మండలి రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో కళాకారుల ఆటపాటలు, వీధి నాటకాలతో ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేసిందన్నారు.
ముఖ్యంగా 1992లో నల్లగొండ జిల్లాలో జరిగిన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో ఐదు వేల మంది కళాకారులను తయారు చేసి గ్రామ గ్రామాన అక్షరాస్యత ఆవశ్యకతను ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం మెప్పు పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి మాజీ కళాకారుడు జోగునూరి సుందర్రావు కరుణ, మాజీ జడ్పీటీసీ తాడి విజయమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, పీఎన్ఎమ్ తుంగతుర్తి బాధ్యుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బూర్గుల ప్రభాకర్, ఈదుల వీర పాపయ్య, పోలేపాక శ్రీనివాస్, జై భీమ్ కళాకారుడు పల్లెర్ల మల్లేశ్, సైదులు, మచ్చ నరసయ్య, శైలజ, అరుణ, సుజాత పాల్గొన్నారు.