– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
– ఆశాల అక్రమ అరెస్టులకు నిరసనగా నల్లగొండలో రాస్తారోకో
– ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్
నీలగిరి, మార్చి : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని చలో అసెంబ్లీకి వెళ్తున్న ఆశలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సోమవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని ఆశాలంతా నల్లగొండ సుభాష్ విగ్రహం దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశ కార్యకర్తలకు పారితోషకాలు కాకుండా ఫిక్స్డ్ రూ.18 వేల వేతనం ఇస్తామని ప్రకటించిందని తెలిపారు. గెలిచి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా హామీ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా హామీ అమలు చేయాలని కోరుతూ చలో హైదరాబాద్ వెళ్తున్న ఆశా కార్యకర్తలను ముందు రోజు రాత్రి ఇండ్ల మీద పడి మహిళలని చూడకుండా అర్థరాత్రి అరెస్టులు చేశారని, కొంతమంది ఏదో విధంగా హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ర్యాలీగా వెళ్తున్న ఆశ కార్యకర్తలను, సిఐటియు నాయకులు నిర్బంధించి పోలీసులు సూదులతో గుచ్చడం, గిచ్చడం లాంటి దుర్మార్గకరమైన విధానాలను అవలంభిస్తూ అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపించారు. ప్రజా పాలన అని చెబుతూ ఉద్యమకారులపై నిర్బంధాన్ని ప్రయోగించడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి నిర్బంధ చర్యలు మానుకోకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు నిర్ణయించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు సీహెచ్ అనురాధ, ఆశా వర్కర్స్ యూనియన్ తిప్పర్తి, కనగల్, రాములబండ, నల్లగొండ అర్బన్ లైన్ వాడ, మాన్యంచెల్క, పానగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా కార్యకర్తలు పార్వతమ్మ, కె.స్వర్ణ, వజ్రమ్మ, వీరభద్రమ్మ, ప్రేమలత, అనురాధ, జీవనజ్యోతి, ప్రమీల, రాజేశ్వరి, హేమలత, మాధవి, మహేశ్వరి పాల్గొన్నారు.