నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి15(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం కేసీఆర్ 71వ పుట్టినరోజును ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు జన్మదిన వేడుకలను పెద్దఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, సంఘాల ఆధ్వర్యంలోనూ పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. వీలైన చోట్ల రక్తదాన శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల్లోనూ అన్నదానం, ఇతర వస్తువులను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్డు పంపిణీకి సిద్ధమవుతున్నారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులకు ముఖ్యంగా యువత ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇక ప్రభుత్వంపై జనంలో తీవ్ర అసంతృప్తి, పథకాల అమలుపై వ్యతిరేకత వెరసి కేసీఆరే మళ్లీ కావాలి… రావాలి అంటూ వెల్లువెత్తుతున్న జనం మనోగతం నేపథ్యంలో అధినేత, అభిమాన నాయకుడు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగస్వాములు అయ్యేందుకు పార్టీ శ్రేణులంతా ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇదే సందర్భంగా కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన హారితహారానికి కొనసాగింపుగా పలుచోట్ల మొక్కలు నాటి వృక్షార్చణలో భాగస్వామ్యం అయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. అధినేత కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎంగా ఉమ్మడి జిల్లాను గత పదేండ్లు అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్‌కు ఆయన పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై కృతజ్ఞత చాటాలన్నారు.