మిర్యాలగూడ, అక్టోబర్ 30 : మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ గ్రౌండ్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది సభకు తరలిరానున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2గంటలకు సభకు హాజరై ప్రసంగించనున్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఐదు మండలాలు సీఎం కేసీఆర్ రాక సందర్భంగా గులాబీమయమయ్యాయి. అడుగడుగునా గులాబీ దళపతి భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. సీఎం రాకతో నియోజకవర్గానికి మరింత మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కర్రావు గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ సభకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అపూర్వారావు భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలను పర్యవేక్షించారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ స్థలాల వద్ద వాహనాల నిలిపివేత వంటి అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. 400మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 4డీఎస్పీలు, 15మంది సీఐలు, 50మంది ఎస్ఐలు, 110ఏఎస్ఐలు, మరో 300మంది కానిస్టేబుల్, హోంగార్డులతో బందోబస్తు నిర్వహించనున్నారు.