సూర్యాపేట, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం అనంతరం ఆ విషయాన్నే విస్మరించింది. జూన్ 15వ తేదీన అంటే 50 రోజుల క్రితం పాఠశాలలు ప్రారంభమైనా ఇప్పటి వరకు మెటీరియల్ అందలేదు. ప్రజాప్రతినిధుల జోక్యంతో ఆలస్యమైనా వారం రోజుల క్రితమే టీచర్, ఆయాల రిక్రూట్మెంట్ పూర్తయింది. ఇక చిన్నారులకు కావాల్సిన మెటీరియల్ ఇప్పటి వరకూ అందలేదు.
స్వయానా ముఖ్యమంత్రి చేతిలో ఉన్న విద్యాశాఖ ఎంతటి దీన స్థితిలో ఉందో ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు ఒక ఉదంతం మాత్రమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని తెలంగాణ విద్యా వ్యవస్థను రోల్ మోడల్‌గా తీర్చి దిద్దుతానని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం శుష్కవాగ్ధానాలకే పరిమితమయ్యారు. విద్యాశాఖ పరిస్థితిని చూస్తే ఏనాడూ ఇంతటి దారుణమైన, అనాలోచిత నిర్ణయాలు లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 25 ఎకరాల్లో అన్ని వసతులతో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా నియోజకవర్గానికో యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ప్రకటనలు చేశారు.
కానీ జిల్లాలో అవి ఎక్కడా కనిపించడం లేదు. 6 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్నల్ మార్కులు ఉండవని, వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఇది అనాలోచిత నిర్ణయం.. అనుకున్నారో ఏమో మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇలా అనేక నిర్ణయాలు తీసుకోవడం అమలుకు నోచుకోకపోవడం సర్వసాధారణమైంది. అలాగే ఈ ఏడాది ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటనలు వెలువడినా అనంతరం ఆ విషయాన్నే అధికారులు విస్మరించినట్లు కనిపిస్తున్నది.
పాఠశాలలకు అందని మెటీరియల్
రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటనలు చేశారు. కానీ ఆచరణ మాత్ర శూన్యం. పాఠశాలలు ప్రారంభమై 50 రోజులు గడిచినా ఇప్పటికీ కావాల్సిన మెటీరియల్ అందకపోవడం గమనార్హం. జిల్లాలో విద్యార్థుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉన్న 91 ప్రైమరీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నడిపేందుకు ఎంపిక చేసి, జూన్ 15న ప్రారంభించారు. ఆయా పాఠశాలల్లో 5 నుంచి 20 మంది వరకు చిన్నారులను చేర్చుకున్నారు. అయితే చిన్నారులకు కావాల్సిన క్రీడా పరికరాలు, మానసికోల్లాసాన్ని కలిగించే బొమ్మలు, ఉపకరణాలు చదువుకు ఉపయోగపడే మెటీరియల్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ అందలేదు. వీటితో పాటు పౌష్టికాహారం అందించాల్సి ఉన్నా ..మధ్యాహ్న భోజనమే అందిస్తున్నట్లు తెలుస్తున్నది.
అలాగే జిల్లాలో ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను 40 రోజుల తరువాత రిక్రూట్ చేశారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు తమకు కావాల్సిన జాబితా ఇచ్చి వారినే రిక్రూట్ చేయాలన్నారట. దీంతో ఆర్టీఏ ద్వారా ఎవరైనా లెటర్ పెడితే తాము బలవుతామని భావించిన అధికారులు ఆ జాబితాను పెండింగ్‌లో పెట్టారు. అయితే నిబంధనల మేరకే రిక్రూట్ చేయాలని ఇటీవల కలెక్టర్ ఆదేశించడంతో ఆలస్యంగానైనా భర్తీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి విద్యాశాఖను సమర్థత ఉన్నవారికి అప్పగించి, విద్యాశాఖను గాడిన పెట్టకుంటే రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థ మరింత కునారిల్లిపోవడం ఖాయం. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్‌పై జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ను వివరణ కోరగా టెండర్లు కాల్ చేశాం..త్వరలోనే వస్తాయని చెప్పారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావొస్తోందని.. ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోందంటే ఆయన వద్ద సమాధానం లేదు.
ప్రకటించినవి 23.. వచ్చినవి అరకొర..
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులులకు అవసరం అయ్యేలా కిట్స్ అందిస్తామని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినా..ఆచరణలో అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా జిల్లాలోని సగం పాఠశాలలకు కొంతమేర మాత్రమే అందించారు. ప్రభుత్వ పాఠశాలలకు 12 రకాల మెటీరియల్ గురుకుల, కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులులకు 23 రకాలు అందిస్తామన్నారు.
గురుకుల, కేజీబీ వీ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులులకు ఇస్తామన్న 23 రకాల వస్తువుల్లో రెండు డ్రస్‌లు, వైట్ డ్రెస్, స్కూల్ బ్యాగ్, బ్లాక్ అండ్ వైట్ షు, సాక్స్‌లు, బెల్ట్, టై, ఐడీ కార్డు, పీటీ డ్రస్, ట్రాక్ సూట్, నైట్ డ్రెస్, బ్లాంకెట్స్, టవల్, కార్పెట్, ట్రంక్ బాక్స్, స్పోర్ట్స్ షూ, ప్లేట్, గ్లాస్, కటోరా, బౌల్, స్పూన్స్, కప్ విత్ హాం డిల్, ట్రోలీ బ్యాగ్‌లు ఇవ్వాల్సి ఉండగా కొన్ని పాఠశాలలకు మాత్రం టవల్, యూనిఫాం, కార్పెట్, బ్లాంకెట్, ప్లేట్, స్పూన్, గ్లాస్, కోటోరలు మాత్రమే రాగా మిగిలినవి రాలేదు. ఇక ప్రభుత్వ పాఠశాలలకు అందాల్సిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ తదితర 12 రకాల మెటీరియల్ అందాల్సి ఉండగా అరకొరగానే వచ్చాయని పాఠశాలల ఉపాధ్యాయుల ద్వారా తెలిసింది.