నల్లగొండ, జూన్ 02 : అన్ని రకాల పరీక్షలకు ఒకేచోట పరిష్కారం దొరికేలా యాప్ రూపొందించడం అభినందనీయం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి రూపొందించిన ఆన్లైన్ E- క్లాసెస్ యాప్‌ను జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, ఇస్లావత్ రాంచందర్ నాయక్, పార్టీ నాయకులు మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాక్రోచ్ లాంటి యాప్‌నకు 15 రోజుల్లోనే 15 కోట్ల మంది ఫాలోవర్స్ గా మారడం అంటే ప్రభుత్వాల పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు. ప్రభుత్వాల పట్ల ప్రజల విముఖతకు నిదర్శనం. ఒక సీఎం ఇవాళ పది నిముషాలు కూడా ప్రసంగించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. ఇది సీఎం రేవంత్ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. అదే కేసీఆర్ అద్భుతంగా పాలించి ప్రత్యక్షంగా పరోక్షంగా కోటి ఉద్యోగాలు సృష్టించినట్లు తెలిపారు. ఒక్క కరెంట్ విభాగంలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ ఇండిస్త్రీయల్ పాలసీతో 20 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడే నాటికీ రాష్ట్రంలో సాగు భూమి 1.20 కోటి ఎకరాలు, కానీ మూడేండ్లలోనే అదనంగా కోటి ఎకరాలు సాగులోకి తేవడంతో మొత్తం సాగు భూమి 2.10 కోట్ల ఎకరాలకు చేరిందని, దీంతో పరోక్షంగా 50 లక్షల మందికి తాము ఉపాధి కల్పించినట్లు తెలిపారు.

అన్ని రకాల పరీక్షలకు ఉపయోగపడేలా యాప్ రూపకల్పన అభినందనీయం : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
కెసిఆర్ హయంలో రాష్ట్ర జీఎస్డీపీ సైతం రూ.3 లక్షలు నుండి రూ.15 లక్షలకు చేరిందన్నారు. కరెంట్, తాగునీటిని అద్భుతంగా అందించినట్లు, కృష్ణా, గోదావరి నదుల నీళ్లను తెచ్చి సురక్షిత నీటిని ఇంటింటికి సరఫరా చేసినట్లు చెప్పారు. సీఎంకీ జై తెలంగాణ అనడమే ఇష్టం ఉండదు. ఆయనకు రాష్ట్రంపై ప్రేమ లేదు. ఇంతటితో లాస్ట్ తమ పని.. మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని రేవంత్ రెడ్డికి అర్థం అయిందన్నారు. ఇప్పటికి గుజరాత్ లో ఆరు గంటల కరెంట్ నే ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విధ్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
ఇప్పటికి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా పథకాలు లేవన్నారు. తెలంగాణ గురించి మాట్లాడుకోవడమే ఈ రెండు పార్టీలకు ఇష్టం ఉండదు. ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఎండ కొడుతుందని 10 నిమిషాల్లోనే కార్యక్రమం ముగించుకుని వెళ్లిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి వాటితో రాష్ట్రాన్ని ఏ ముర్ఖుల చేతిలో పెట్టామో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. కృష్ణా, గోదావరిల మధ్య కేసీఆర్ తెచ్చిన తెలంగాణ చరిత్ర ఇవాల్టి ఘనత. తెలంగాణను చూసి ప్రపంచం అంతా నేర్చుకునేలా పాలన సాగించిన దార్శనికుడు కేసీఆర్ అన్నారు. రాకేశ్ రెడ్డి తెచ్చిన యాప్‌ను అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సాగే పోరాటాల్లోనూ యువత, నిరుద్యోగులు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.