కోదాడ, ఆగస్టు 08 : తనకు కానీ తన కుటుంబ సభ్యులకు గానీ ఏ హాని జరిగినా గింజల రమణారెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావుదే బాధ్యత అని కోదాడ కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం రైస్ మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా గింజల రమణారెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు తన వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను బ్రష్టు పట్టించే విధంగా అసత్య ప్రచారాలు, నిందారోపణలు చేస్తూ పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వారికి ఉన్న సమస్య ఏమిటో పరిష్కరించుకోమని పలుమార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ వారు సమాధానమివ్వకపోగా, తమకు అన్యాయం జరిగిందంటూ అసత్య ప్రచారాలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు.
ఇరువురు పరిష్కార దిశగా స్పందించకపోవడంతో తాను గురు, శుక్రవారాల్లో బహిరంగ చర్చకు రావాలని పత్రికా ముఖంగా కోరానన్నారు. రెండు రోజుల్లో ఇరువురు బహిరంగ చర్చకు రాకపోవడం విచారకరమన్నారు. దీంతో వారికి తనవల్ల ఎలాంటి నష్టం, ఇబ్బంది కలగకున్నప్పటికీ తనను సమాజంలో దెబ్బతీసేందుకే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. చివరకు హత్యాయత్నానికి కూడా పాల్పడినట్లు తెలిపారు. బహిరంగ చర్చకు రానందున భవిష్యత్తులో తనపై అసత్య ప్రచారాలు, నిందారోపణలు చేయవద్దని, తన వ్యాపార సంస్థలకు విద్యా సంస్థలకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని, వారి వ్యవహార శైలి మార్చుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.