– పట్టణంలో మొబైల్స్‌తో పాటు పలు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్
నీలగిరి, ఆగస్టు 22 : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పట్టణంలో జరుగుతున్న మర్వాడి వ్యతిరేఖ ఉద్యమం నల్లగొండను కూడా తాకింది. తెలంగాణ రాష్ట్ర బంద్ కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వ్యాపారస్తులు, జిల్లా కేంద్రంలోని అన్ని మొబైల్ దుకాణాలతో పాటు శానిటరీ, ఎలక్ట్రికల్, కిరాణ అసోసియేషన్, ఎలక్ట్రికల్స్, హార్డ్‌వేర్ అసోసియేషన్, వస్త్ర దుకాణాలు, స్టీల్, సిమెంట్ అసోసియేషన్, స్వర్ణకారులు, చెప్పుల దుకాణాలు, హేయిర్ సెలూన్స్, రెడీమేడ్ దుకాణాలు, అన్ని వ్యాపార సముదాయాల వారు స్వచ్చందంగా బంద్ చేసి నిరసనలో పాల్గొన్నారు. మార్వాడీలు నకిలీ వస్తువులను తీసుకువచ్చి ప్రజలను మోసం చేయడమే కాకుండా, నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఆరోపిస్తూ వందలాది మంది జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీకి అనుమతి లేదంటూ నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ వై.సైదులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చేటుచేసుకుంది. తెలంగాణ బచావో.. మార్వాడి హఠావో, మార్వాడి గో బ్యాక్ అంటూ, పోలీసులు సహకరించాలని, తమ పొట్టలు కొట్టవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం మొబైల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అరెస్టులతో గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని ఆపలేరన్నారు. తెలంగాణలో బతకాలంటే తెలంగాణ ఉనికిని చాటుతూ మార్వాడీలు బతకాల్సిందేనన్నారు. హోల్‌సేల్ వ్యాపారాలు చేసే మార్వాడీలకు తెలంగాణలో స్వాగతమిస్తామని, స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొట్టడానికి వచ్చిన రిటైల్ వ్యాపారులను మాత్రం తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మార్వాడీల అరాచకాలను నియంత్రించాలన్నారు. మార్వాడీల అరాచకాలను తట్టుకోలేక ఎంతోమంది చిరు వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మొబైల్ షాప్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, ఎండీ అబ్దుల్ సమీ, ఖలీమ్, కరుణాకర్ రెడ్డి, మందడి రాంరెడ్డి, శేఖర్, స్టార్ మొబైల్ అజీజ్, వివిధ సంఘాల నాయకులు, ఎలక్ట్రిక్ షాపుల నిర్వాహకులు, ఎంటీ మార్కెట్ నిర్వాహకులు, వైశ్యులు పాల్గొన్నారు.
Nalgonda : నల్లగొండను తాకిన మార్వాడి వ్యతిరేక ఉద్యమం