యాదగిరిగుట్ట, ఫిబ్రవరి19: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు రండంటూ ముక్కోటి దేవతల ఆహ్వాన పర్వాలు అంగరంగ వైభవంగా సాగాయి. రెండోరోజు గురువారం ఉదయం 11.30 గంటలకు అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవన కార్యక్రమాలు పాంచరాత్రగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. గరుడ ఆళ్వారులకు ఇష్టనైవేద్యం, రాత్రి సకల దేవతలకు ఇష్టమైన మేళతాళాలతో భేరీ పూజ, అగ్ని దేవుడికి ఆరాధన, హవన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం కార్యక్రమం అత్యం త వైభవంగా చేపట్టారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన యాదగిరి శ్రీలక్ష్మీనారసింహస్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించేందుకు గరుత్మంతుడిని నియుక్తం చేసే ధ్వజారోహణం అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణందార్లు, యాజ్ఞిక బృందం శ్రీకారం చుట్టారు. ధ్వజారోహణ ఘట్టానికి ముందు ప్రధానాలయ ఉత్తర మాడ వీధుల్లోని ప్రత్యేక యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు.
అనంతరం అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు గావించారు. ప్రత్యేకంగా గరుడ అదివాసం, గరుడ హోమ కార్యక్రమాలు నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం పాంచరాత్రగమశాస్త్రరీతిలో శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ధ్వజాస్తంభంపై ధ్వజారోహణం అనంతరం అష్టదిక్పాలక బలిహరణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణం వేడుకలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన వాహనం గరుత్మంతుడిని కొలుస్తూ జరిపే తంతు భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది.
గరుడాళ్వార్ల చిత్రపటం వద్ద పట్టువస్ర్తాలు, వజ్రవైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలతో అలంకరించిన స్వామి, అమ్మవార్లను వేదికపై అధిష్టింపజేసి వేదమంత్రాలతో దేవతలను అర్చించారు. గరుత్మంతుడి పటాన్ని శ్వేత ధ్వజ పతాకంపై చిత్రికరించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గరుడపతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేసే పర్వాలు నిర్వహించారు. ధ్వజ దండాన్ని పూజించి అనంతరం తెల్లని వస్త్రంపై గరుత్మంతుని చిత్రించి 27 విదాలైన ఉపచారాలతో ఆరాధన గావించి చతుర్వేదాలతో దేవతలను ఆవాహన చేశారు. గరుత్మంతుడు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన గరుడ మద్దులను పైకి ఎగురవేసి పూజలు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అష్టిదిక్పాలకులను ఆహ్వానించేందుకు సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. భేరీ తాడవం మంత్రపూర్వకంగా జరిపారు. ఉత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని భగవదారాధనతో వివిధ రాగ, తాళాలతో అనేకమైన స్తోత్రపఠాలతో అత్యంత వైభవవంగా వేడుక నిర్వహించారు. శబ్ధ బ్రహ్మం, మూలమంత్ర జపంతో ప్రధాన వాయిద్య భేరీ మోగించి కంకణధారణ చేశారు. నిత్యరాధనల అనంతరం జరిపిన దేవతాహ్వానంలో సాయంత్రం ప్రత్యేక హోమం నిర్వహించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవోత్సవాలు శుక్రవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.