నల్లగొండ, అక్టోబర్ 26: ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా అధికారులు ఆ ప్రకటన ఆధారంగా దొడ్డు ధాన్యం, సన్న ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే మొత్తం ఇప్పటి వరకు 229 దొడ్డు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 66 సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న అధికారులు వాటిని ఇప్పటికే ప్రారంభించామని అంటున్నారు. అయితే దొడ్డు ధాన్యం కేంద్రాల్లో ధాన్యం తీసుకుంటున్నా.. సన్న ధాన్యం మాత్రం ఇప్పట్లో కొనుగోలు చేసేది లేదని, మరో పది రోజులు ఆగాల్సిందేనని చెప్పటంతో కోసిన ధాన్యం ఎక్కడ ఆరపోయాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఈ ఏడాది మొత్తం 6 30 981 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రావాల్సి ఉండగా అందులో 4 65 657 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 1 65 324 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం ఉంది. అయితే సన్నాలకు గత సీజన్లో కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. అయితే ఇస్తుందనే ఆశతో కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం తెస్తున్నా కొనుగోలుకు అధికారులు అంగీకరించటం లేదు. ప్రస్తుతం దొడ్డు రకం కొనుగోలు చేస్తున్నామని..మరో పది రోజుల తర్వాతే సన్నాలు కొంటామని..అప్పటి వరకు తేవద్దని చెప్పటంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. దొడ్డు రకం కేంద్రాల్లో కాకుండా సన్న ధాన్యం కేంద్రాల్లో కూడా ఎందుకు కొనటం లేదో అధికారులకే తెలియాలి.
సన్న ధాన్యం ఇప్పట్లో కొనమంటున్నారు..
ఎకరం భూమిలో సన్న ధాన్యం సాగు చేశా. పది రోజుల క్రితమే వరి కోసి ఆర్జాలబావి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే వద్దని సీఈవో అన్నడు. దీంతో ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకెళి ఆరపెట్టా. ఇప్పుడు ధాన్యం ఆరినా కొనేందుకు మరో పది రోజులు పడుతుంది. అప్పటి దాక కొనమని అంటున్నాడు.
-మందడి వెంకట్ రెడ్డి, రైతు, మర్రిగూడెం
పది రోజుల తర్వాతే రండి..
ప్రస్తుతం నల్లగొండ మండలంలోని ఏడు పీఏసీఎస్ కేంద్రాల ద్వారా దొడ్డు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఆర్జాలబావి సెంటర్లో సన్న ధాన్యం కొనాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు దొడ్డు ధాన్యం మాత్రమే ఎక్కువగా ఉండటంతో సన్న ధాన్యం కొనుగోలు చేయలేక పోతున్నాం. ఇక్కడ స్థలం కూడా లేనందున మరో పది రోజుల తర్వాతే సన్నాలు తీసుకు రావాలి.
-అనంతరెడ్డి, సీఈవో, పీఏసీఎస్, నల్లగొండ