నల్లగొండ ప్రతినిధి, మే7 (నమస్తే తెలంగాణ) : ఈ నెల ఒకటి.. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం. ఇక్కడ అవసరమైన లారీలు లేక ధాన్యం తరలింపు ఆలస్యం చేస్తున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠికి తనిఖీ సమయంలోలో రైతులు పిర్యా దు చేశారు. ఎక్కువ లారీలు పెట్టాలని ఆదేశించినా నిర్లక్ష్యంగా ఉన్న లారీ కాంట్రాక్టర్‌పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అతడిపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కూడా కొనుగోళ్ల తీరులో పెద్దగా మార్పు లేదు.
ఈ నెల 3.. కనగల్ మండలం లచ్చిపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం.. ఇక్కడ లారీలు లేక ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నట్లు కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. వెంటనే అవసరమైన లారీలు రప్పించి ధాన్యం తరలించాలని, జాప్యం లేకుండా కొనుగోళ్లు జరుపాలని కలెక్టర్ ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
ఈ నెల 5.. చండూరు మండలం పుల్లెంల ఐకేపీ కొనుగోలు కేంద్రం.. ఇక్కడ లారీలు రాక ధాన్యం కొనుగోళ్లల్లో తీవ్ర ఆలస్యం అవుతుందన్న పిర్యాదుతో కలెక్టర్ తనిఖీ చేశారు. వాస్తమేనని తేలడంతో తక్షణమే అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నెల 6.. గుర్రంపోడు మండలం కొప్పోలు, గుర్రంపోడు కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ పర్యటించారు. ఇక్కడా లారీల సమస్యతోనే కలెక్టర్ తనిఖీలు చేయాల్సి వచ్చింది. ధాన్యం తరలింపునకు లారీలు లేవని గుర్తించి తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లారీ కాంట్రాక్టర్‌తోపాటు స్థానిక లారీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్పోర్ట్ సమస్య రావద్దని హెచ్చరించారు.
ఈ నెల 7.. నార్కట్‌పల్లి మండలం షాపల్లి శివారులోని ఐకేపీ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. లారీలు రాకనే ధాన్యం తరలించలేదని, మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయిందన్న ఫిర్యాదుతో కలెక్టర్ ఇక్కడ పర్యటించారు. లారీలపై ఆరా తీస్తే ఈ నెల రెండు, 5వ తేదీన మాత్రమే లారీ వచ్చినట్లు తేలింది. లారీల సంఖ్య పెంచితేనే త్వరగా ధాన్యం కాంటా అవుతుందని రైతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. ఇదే రోజున శాలిగౌరారం మండలం రామగిరి ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇక్కడా రెండు రోజుల నుంచి లారీలు రాకనే కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు.
ఇలా నల్లగొండ జిల్లా పరిధిలో ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యంంతో రైతులు రోడ్లు ఎక్కుతుండడంతో ఏకంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయంగా కొనుగోలు కేంద్రాల్లో పర్యటించక తప్పడం లేదు. కలెక్టర్ వస్తే తప్ప ధాన్యం కొనుగోళ్లలో కదలిక ఉండడం లేదు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఆటంకాలను గుర్తించి వాటిని అధిగమించడంలో ఇతర అధికారులు చేతులెత్తేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్ త్రిపాఠి.. అదనపు కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి తనిఖీలు చేస్తే తప్ప పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండడం లేదు. కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కలెక్టర్ పరిశీలనలో ప్రతి చోటా వెల్లడైంది. ధాన్యం తరలింపు కాంట్రాక్ట్ దక్కించుకున్న లారీల కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమైంది. సదరు కాంట్రాక్టర్‌పై ప్రారంభం నుంచి జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోపాటు ఆయన తన రాజకీయ పలుకుబడితో అధికారుల ఆదేశాలను భేఖాతరు చేస్తూ నిర్లక్ష్యం చేస్తుండడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తరలింపునకు నిత్యం కనీసం 300 లారీలు పెట్టాల్సి ఉండగా, కేవలం 150కి దాటడం లేదని సమాచారం. లారీల కాంట్రాక్టర్‌ను కలెక్టర్ స్వయంగా హెచ్చరిస్తున్నా స్పందన ఉన్న దాఖలాలు లేవు.
మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని, అందుకే లారీలను సమకూర్చలేక పోతున్నామని కాంట్రాక్టర్ ఎదురు చెప్తున్నట్లు సమాచారం. ఇదే విషయంలో మిల్లుర్లు సైతం తాలు, తేమ పేరుతో క్వింటాకు రెండు కిలోల వరకు తరుగుకు అంగీకరిస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని కొర్రీలు పెడుతుండడంతో ఒక్కో లారీ రెండు, మూడు రోజులు మిల్లుల వద్దే ఆగిపోతున్నది. మిల్లర్లతో సంప్రదింపులు జరిపి వెంట వెంటనే సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇలా ప్రతి దశలోనూ ఆటంకాలతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసుకుని రైతులు ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల నెల రోజులకు పైగా రైతులు ధాన్యం తెచ్చి వేచిచూస్తున్నారు. ఈ మధ్యలోనే పలుమార్లు అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయితే తిరిగి ఆరబెట్టలేక రైతులు బేజారవుతున్నారు. ఎప్పటికి కొనుగోళ్లు పూర్తవుతాయనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. మరోవైపు గోనె సంచుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నది. అవసరమైన గన్నీ బ్యాగులను తెప్పించి సకాలంలో కేంద్రాలకు సరఫరా చేయడంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని తిప్పర్తి మండలం బండ్లోరిగూడెం కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు లేక కొనుగోళ్లు ఆపేశారు. సివిల్ సప్లయ్ మేనేజన్ను గోనె సంచుల కోసం ఒకటికి పదిసార్లు బతిమాలికోవాల్సి వచ్చింది. త్రిపురారం, కట్టంగూర్, కనగల్, హాలియా, వేములపల్లి, పెద్దవూర, మునుగోడు, నార్కట్‌పల్లి మండలాల్లోనూ గోనె సంచులు లేక ధాన్యం కాంటాలు నిలిచిపోయాయి. జిల్లాకు సుమారు తక్షణమే 50వేల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నట్లు తెలిసింది. వీటిని తెప్పించడంలో అధికారుల విఫలం అవుతున్నారని రైతులు వాపోతున్నారు.
నల్లగొండ జిల్లాలో ధాన్యం రైతులు 40 రోజులకు పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న ధాన్యం కొనుగోళ్లపై ఆది నుంచి ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి పట్టింపు లేదు. భూ భారతి, ఇతర పథకాలే తమ ప్రాథమ్యాలు అన్నట్లుగా ధాన్యం కొనుగోళ్లను ద్వితీయ ప్రాధాన్యతగానే గుర్తించినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. వాస్తవంగా ధాన్యం కొనుగోళ్లపై ఆరంభం నుంచే జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల విభాగం అధికారులు సీరియస్‌గా మానిటరింగ్ చేయాలి. కానీ.. కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులకు భూ భారతి అవగాహన సదస్సులతో సరిపోతుండగా, కీలక సమయంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసులు సెలవుపై వెళ్లడంతో కొనుగోళ్లపై పర్యవేక్షణ లేకుండా పోయింది. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం, పౌర సరఫరాల అధికారి సైతం కొత్తవాళ్లు అవడంతో ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూడాల్సి వస్తున్నది. వీరికితోడు ఈ యాసంగిలో రైతులను ప్రకృతి పగ బట్టిందా అన్నట్లు నిత్యం ఏదో ఒక చోట అకాల వర్షం రైతులను బెంబేలెత్తిస్తున్నది. అకాల వర్షాలతో ధాన్యం రాశులు కొట్టుకుపోవడం, తడిసి ముద్దవడం, తిరిగి ఆరబెట్టడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. నేటికీ జిల్లాలో ఇంకా 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 5.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేటికీ 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు రాగా, 3.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పూర్తి చేశారు. మరోవైపు మిల్లుల వద్ద లారీల్లో నుంచి దిగుమతి అయ్యాక ట్రక్షీట్లు జారీ అయ్యింది మాత్రం సుమారు 2.50లక్షల మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం. ప్రతి దశలోనూ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయి కనిపిస్తున్నది.
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం ఎన్జీకొత్తపెల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో వడ్లు పోసి నెల రోజులైనా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం ఎండకు, రాత్రిళ్లు వస్తున్న వానకు అవస్థలు పడుతూ.. రోజూ ధాన్యం రాశుల దగ్గరే పడిగాపులు గాస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు కూడా లారీల కొరత ఉండడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. లారీలు రాకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 6వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, మరో 4వేల క్వింటాళ్ల వరకు పోగుపడి ఉన్నాయి. మొదట్లో రోజు విడిచి రోజు లారీలు రాగా, వారం నుంచి లారీల కొరత తీవ్రంగా ఉందని రైతులు వాపోతున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు నిల్వ ఉండడంతో వర్షానికి తడుస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. దాదాపు 1,800 బస్తాల ధాన్యం తూకం వేసి ఉండగాచ సోమవారం రాత్రి కురిసిన అకాల వర్సానికి తడిశాయి.
మా వడ్లు అమ్ముకునేందుకు ఎన్జీకొత్తపల్లిలోని ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైంది. ఎంతకని ఆరబోయాలి. తిరగబోయలేక చస్తు న్నాం. ఇంకా తూకం వేస్తలేరు. ఇంత దరిద్రం ఎప్పు డూ లేదు. వడ్లు ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి. పచ్చిగ ఉంటేనేమో అధికారులు కొంటలేరు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టాలంటే యాష్టకొస్తున్నది.
మా వడ్లు అమ్ముకునేందుకు ఎన్జీకొత్తపల్లిలోని ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైంది. ఎంతకని ఆరబోయాలి. తిరగబోయలేక చస్తు న్నాం. ఇంకా తూకం వేస్తలేరు. ఇంత దరిద్రం ఎప్పు డూ లేదు. వడ్లు ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి. పచ్చిగ ఉంటేనేమో అధికారులు కొంటలేరు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టాలంటే యాష్టకొస్తున్నది.
నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసుకున్న ధాన్యం బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. ఈ సెంటర్లో ఇప్పటి వరకు 50 శాతం కొనుగోళ్లు కూడా జరగలేదని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.