సూర్యాపేట టౌన్, జనవరి 01 : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2026 నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ గా ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీసుల ముందస్తు పకడ్బందీ ప్రణాళికలు, నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో అమలు చేసిన భద్రతా చర్యల ఫలితంగా నూతన సంవత్సర వేడుకలు సజావుగా సాగినట్లు వివరించారు. కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేసి ప్రజలు సురక్షితంగా వేడుకలు జరుపుకునేలా విస్తృత చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనలు జరగకుండా 2025 డిసెంబర్ 31 రాత్రి నుంచి 2026 జనవరి 1 ఉదయం వరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారన్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపిన 140 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 496 వాహనాలపై జరిమానా, కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా పోలీసుల విస్తృత ప్రణాళికల కారణంగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎక్కడా రోడ్డు ప్రమాదాలు, గొడవలు జరగలేదన్నారు. ప్రజా భద్రతా దృష్ట్యా రోడ్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రమాదకరమైన చర్యలకు దూరంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.