కోదాడ, సెప్టెంబర్ 03 : ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభ గల విద్యార్థులకు అమృత రామానుజరావు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శేషు ప్రసాద్, ఆయన సోదరులు రూ.5.50 లక్షల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్థిక లేమితో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థుల చదువులకు అమృత రామానుజరావు ట్రస్ట్ చేయూతనిస్తుందన్నారు. ఈ చేయూతను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఆదర్శ సమాజానికి ఉపాధ్యాయులే నిర్దేశకులని, తరగతి గదిలో బోధించే అంశాలతోనే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని, వారు నిబద్ధతతో బోధిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థుల ప్రవర్తనలు చూస్తుంటే ఆందోళన కలుగుతుందని, ఉపాధ్యాయులు మందలించే పరిస్థితి కూడా లేదని, ఏ చిన్న సంఘటన జరిగినా తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై దాడులు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తల్లిదండ్రులు తమ హోదా కోసం పిల్లలకు ఏం అడిగినా సౌకర్యాలు కల్పిస్తున్నారని, దీంతో విద్యార్థులు పక్కదారి పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పిల్లల భవిష్యత్‌లో తల్లిదండ్రులదే కీలకపాత్ర అన్నారు. తమ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. తమ పిల్లలు చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.
విశ్రాంత తెలుగు అధ్యాపకులు, కవి శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సాయం చేయడం హర్షనీయమన్నారు. ఆంగ్ల భాష అధ్యాపకుడు, స్వర్గీయ కొండపల్లి రామానుజరావుకు చదువుకునేవారంటే అభిమానమని ఆయన పేరుపై ట్రస్ట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శేషు ప్రసాద్ మాట్లాడుతూ.. 2011 నుండి ఇప్పటివరకు ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించామని, భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు అక్కిరాజు యశ్వంత్, మంత్రి ప్రగడ శ్రీధర్ రావు, మాధవి లత, కొండపల్లి శ్రీరామ్, వేముల వెంకటేశ్వర్లు, కోలా వెంకటేశ్వర్లు, శర్మ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Kodada : అమృత రామానుజరావు ట్రస్ట్ సేవలు అభినందనీయం : డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి