నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్‌లో నిండా నీళ్లున్నా పాలకుల పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో ఏఎమ్మార్పీ పరిధిలోని చెరువులు, కుంటలకు నీరు చేరక ఆయకట్టులో భూములు బీళ్లుగానే ఉన్న వైనంపై ఈ నెల 20న నమస్తే తెలంగాణలో ‘ఎండుతున్న ఏఎమ్మార్పీ ఆయకట్టు’ శీర్షికన ప్రచురించిమైన కథనం రైతాంగంలో చర్చనీయాంశమైంది. దాంతో ఇరిగేషన్ అధికారులు స్పందిస్తూ అందుకు కారణాలను తెలిపే ప్రయత్నం చేస్తూ సుధీర్ఘ వివరణ పంపారు. ఏఎమ్మార్పీ పుట్టుపూర్వోత్తరాల నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం ఒక మోటార్ రిపేర్‌లో ఉందంటూ ముగించారు.
మోటార్ రిపేర్ ఆలస్యానికి కారణం ఏంటన్నది మాత్రం అందులో వెల్లడించలేదు. ఈ మోటర్ రిపేర్‌ను సకాలంలో చేయకపోవడం వల్లే నాగార్జునసాగర్ నిండి నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీరు అందడం లేదన్నదే నమస్తే తెలంగాణ కథనం ప్రధాన ఉద్దేశం. సాధారణంగా వ్యవసాయంలో పంటలు వేయడానికి, వివిధ దశల్లో పంటల సస్యరక్షణకు సరైన సమయం లేదా అదును అనేది చాలా ముఖ్యం. కానీ అధికారులు మాత్రం సాగర్ నిండా నీళ్లున్నాయి.. తొందరేం లేదు.. త్వరలోనే చివరి భూములకు నీళ్లిస్తామంటూ సింపుల్‌గా తేల్చేస్తుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అసలే గతేడాది సరైన వర్షాల్లేక సాగర్ నిండక ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో నీళ్లు ఇవ్వక భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి.
గత వేసవిలో వరి సంగతి దేవుడెరుగు.. పండ్ల తోటలను రక్షించుకునేందుకు కూడా రైతులు నానా తంటాలు పడ్డారు. తీవ్ర నీటి కరువులో ఉన్న రైతులు సాగర్‌లోకి వరద నీరు వస్తుంటే… కరువు తీరా నీళ్లొస్తున్నాయని సంబురపడ్డారు. కానీ వారి సంతోషానికి పాలకుల పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం అడ్డంకి మారింది. ఏఎమ్మార్పీలో నాలుగు మోటార్లు ఉంటే వాటిని సీజన్ ప్రారంభం నాటికే సిద్ధం చేసుకోవాల్సి ఉన్నా అలా జరుగలేదు. రెండు నెలలుగా యూనిట్-1 మోటార్ రిపేర్‌లో ఉండగా, నేటికీ అందుబాటులోకి రాలేదు. ఈ నెల 31 నాటికి రిపేర్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఏఎమ్మార్పీ ఇరిగేషన్ సబ్ డివిజన్-3, అక్కంపల్లి డీఈఈ పి.నాగ య్య ‘నమస్తే తెలంగాణ’ కథనంపై స్పందిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం మూడు మోటార్ల ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి ని ఎత్తిపోస్తున్నామని, అందులో 525 క్యూసెక్కుల నీరు జంట నగరాలకు తాగునీటి కోసం, 45 క్యూ సెక్కుల నీరు మిషన్ భగీరథ కోసం, 1,210 క్యూ సెక్కుల నీరు జిల్లాలోని తాగు, సాగునీటికు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31 నాటికి మొత్తం నాలుగు మోటార్లను రన్ చేసి ఏఎమ్మార్పీ చివరి ఆయకట్టుకు సాగునీటితో పాటు చెరువులను నింపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్లు పేర్కొన్నారు.
అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా నీటిని ఇవ్వాల్సిన డిస్టిబ్యూటరీ-7(బి)కి సరైన నీటిమట్టం లేనందుకు ఇవ్వలేకపోతున్నట్లు ఒప్పుకొన్నారు. ప్రస్తుతం అక్కంపల్లిలో 242 అడుగుల వాటర్ లెవల్ ఉందని, 243.70 వాటర్ లేవల్ ఉంటేనే డిస్ట్రిబ్యూటరీ పరిధిలోని 5,200 ఎకరాలకు సాగునీరు ఇవ్వగలమని తెలిపారు. దాంతో ఏమ్మార్పీ పరిధిలో చెరువులు నిండాలన్నా, సాగునీరు రావాలన్నా, వచ్చే నెల మొదటి వారం వరకు రైతులు వేచిచూడక తప్పదని ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్నట్లు స్పష్టమతున్నది.