చందంపేట(నేరెడుగొమ్ము), జూలై 11 : నేరెడుగొమ్ము మండలంలోని 13 వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.184 కోట్లతో మండలంలోని చిన్నమునిగల్ గ్రామంలో నెలకొల్పిన అంబ భవానీ లిఫ్టు పనులకు ప్రస్తుతం బ్రేక్ పడింది. శ్రీశైలం నిండడం, సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగి, సాగర్ బ్యాక్ వాటర్‌తో నీటి మట్టం పెరగడంతో అంబ భవానీ లిఫ్టు పనులు చేపడుతున్న ప్రాంతంలోకి కృష్ణా జలాలు వచ్చి చేరాయి. దీంతో పనులకు బ్రేక్ పడింది. 2026 జూన్ నాటి కి అంబ భవానీ లిఫ్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చకచకా చేపట్టారు. ఇప్పటికే 50 శాతం మేర పనులు పూర్తి కాగా తాజాగా కృష్ణా నది బ్యాక్‌వాటర్ పైపులైన్ పనులు చేపడుతున్న ప్రాంతాన్ని చేరడంతో పనులకు ఆటంకంగా మారాయి.
కృష్ణా నది బ్యాక్ వాటర్ అంబా భవానీ లిఫ్టు పనులు చేపట్టే ప్రాంతానికి చేరడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. దీంతో లిఫ్టు పనులకు దాదాపు ఆరు నెలలు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 1.7కి.మీ. మేర పైపులైన్ కోసం తవ్విన ప్రాంతంలో నీరు చేరడంతో పనులకు ఆటం కం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ ఆరు నెలల కాలంలో లిఫ్టుపై భాగంలో పైపులైన్ పనులు చేపట్టే యోచనలో ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
కృష్ణానది బ్యాక్ వాటర్ వచ్చి చేరడంతో పనులకు ఆటంకంగా మారింది. ప్రస్తు తం చేపడుతున్న పైపులైన్ ప్రాంతంలో నీరుచేరడంతో పనులు కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తు న్నాం. కాలయాపన చేయకుండా లిఫ్టుపైభాగంలో పైపులైన్ పనులు చేపట్టే యో చనలో ఉన్నాం. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.
చిన్నమునిగల్ వద్ద చేపడుతున్న అంబ భవానీ లిఫ్టు పూర్తయితే నేరెడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్, చిన్నమునిగల్, కొత్తపల్లి, మోసంగడ్డ తండా, బచ్చాపురం, బుగ్గతండా, తూర్పు తండాల పరిధిలోని 13వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో ఈ లిఫ్టుకు రూపకల్పన చేశారు.