కాకతీయుల నాటి.. ఆమనగల్లు రామలింగేశ్వరాలయం
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పార్వతీ రామలింగేశ్వర ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో హోలీ పండుగకు ముందు మూడ్రోజులపాటు స్వామి వారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
- రాతి కొండపై ఆలయ నిర్మాణం
- గోధుమ పిండితో శివలింగం ప్రతిష్ఠ
- నేటి నుంచి కల్యాణోత్సవాలు
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పార్వతీ రామలింగేశ్వర ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో హోలీ పండుగకు ముందు మూడ్రోజులపాటు స్వామి వారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. చివరి రోజు అగ్నిగుండాల ప్రవేశంతో ఉత్సవాలు పరిపూర్ణమవుతాయి. ఆదివారం నుంచి జరిగే ఈ ఉత్సవాలకు మండలంలోని పలు గ్రామాలతోపాటు పక్క మండలాల నుంచి భక్తులు తరలివస్తారు.
చారిత్రక నేపథ్యం..
ఆమనగల్లు గ్రామానికి ప్రాచీన చరిత్ర ఉన్నది. రేచర్ల రెడ్డి రాజులకు, పద్మనాయక రాజులకు ఈ గ్రామం ప్రసిద్ధి గాంచింది. ఆమనగల్లులో నాడు దోపిడీ దొంగలు గ్రామంపై పడి దోచుకెళ్లేవారు. రేచర్ల చెవిరెడ్డి అనే రైతు దోపిడీ దొంగలను ఎదిరించి గ్రామాన్ని కాపాడడంతో కాకతీయ గణపతిదేవ చక్రవర్తి చెవిరెడ్డికి బేతాల నాయకుడు అనే బిరుదునిచ్చి సత్కరించినట్లు చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. రేచర్ల వంశీయులు కాకతీయులకు సామంతులుగా పని చేసినట్లు పూర్వీకులు చెబుతున్నారు. నాడు ఆమనగల్లు పిల్లలమర్రి రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. పద్మనాయక రాజుల వంశానంతరం మసనూరి కాపయ్య నాయకుని ఆధీనంలో ఈ గ్రామం ఉండేది. వారి పాలనకు నిదర్శనంగా నాడు కాకతీయ రాజుల సహకారంతో నిర్మించబడినదే రామలింగేశ్వరస్వామి ఆలయం.
మూడ్రోజులపాటు ఉత్సవాలు..
నేటి నుంచి ఈ నెల 7 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పెద్దబోయిన శ్రీను తెలిపారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణం, సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పార్వతీ, రామలింగేశ్వరుల కల్యాణం, మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే 8న ఆలయ సమీపంలోని భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
నాటి ఆనవాళ్లు నేటికీ పదిలం
కాకతీయుల కాలంలో నిర్మితమైన పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఇప్పటికీ సజీవమైన నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి. కొండపై చెక్కబడిన శిల్పాలు, దేవుని విగ్రహాలతోపాటు ఆనాటి శిలాశాసనాలు ఇప్పటికీ కనపడుతున్నాయి. ప్రధానంగా బండపై చెక్కిన శాసనాలు నేటికీ కనిపిస్తున్నాయి. నటరాజస్వామి, నంది, చండీశ్వరుడు, బృంగితోపాటు నవగ్రహాలు, శిలాశాసనాలు దర్శనమిస్తున్నాయి. కొండపై నీటి గుండం ఉంది.
ఆలయ విశిష్టత
రాతి బండపై నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రారంభించే సమయంలో శివలింగాన్ని మండలంలోని ఆగా మోత్కూర్ నుంచి తెచ్చే క్రమంలో ఆ శివలింగం దేవాలయం సమీపంలో ఉన్న కుంటలో పడిపోయింది. ఎంతకీ శివలింగాన్ని ఎత్తలేకపోవడంతో తప్పని పరిస్థితిలో ముహూర్తపు సమయం మించిపోతున్నందున మొదట గోధుమ పిండితో శివలింగాన్ని తయారు చేసి ఆలయంలో ప్రతిష్ఠించినట్లు పూర్వీకులు చెబుతుంటారు. అయితే మరుసటి రోజు శివలింగం పడిన ప్రదేశానికి వెళ్లగా అక్కడ శివలింగం పడిన ఆనవాళ్లు కనిపించలేదట. ఆశ్చర్యపోయిన గ్రామస్తులు, నాటి పాలకులు శివలింగం పడిన ప్రదేశం ఎంతో పవిత్రమైనదిగా భావించిన కాకతీయులు అక్కడ చెరువు(600 ఎకరాల విస్తీర్ణంలో)ను తవ్వించారు. ఆలయ అభివృద్ధికి కొంత భూమిని కేటాయించినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికీ గోధుమమపిండితో తయారు చేసిన శివలింగమే భక్తులకు దర్శనమివ్వడం విశేషం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

