చిట్యాల, అక్టోబర్ 7 : ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హమీ ప్రకారం భేషరతుగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ సోమవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతులకే కాదు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హమీనీ అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై దాడులు చేస్తే కింది నాయకులు బయటకు రారనే భ్రమలో కేటీఆర్, హరీశ్‌రావుపై దాడులకు పాల్పడుతున్నారని, ఇది ఉద్యమ పార్టీ అని, ఎన్ని దౌర్జన్యాలు ఎదురైతే అంత బలపడుతుందని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం అనే హుందాతనాన్ని మరిచి వీధి మనిషిలా చిల్లర భాష ఉపయోగిస్తున్నారన్నారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 10 నెలలు దాటినా మాఫీ చేయకుండా రకరకాల కొర్రీలు పెడుతున్నదని దుయ్యబట్టారు. మహిళలకు ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కారని, ప్రభుత్వంలోని ఓ మహిళా మంత్రి తోటి మహిళ వ్యక్తిగత జీవితంపై నిందారోపణలు చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కొండా సురేఖను వెంటనే ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడులు, దౌర్జన్యాలు చేయడం, పోలీస్ స్టేషన్లలో పైరవీలు చేయడంతోనే కాంగ్రెస్ నేతలు కాలం గడుపుతున్నారని విమర్శించారు. ధర్నాలో చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ నాయకులు రాచకొండ కిష్టయ్య, కొలను వెంకటేశ్, సుంకరి యాదగిరి, మర్ల రాంరెడ్డి, దేవరపల్లి సత్తిరెడ్డి, కోయగూర నర్సింహ్మ, అయిలయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, గోధుమగడ్డ జలంధర్‌రెడ్డి, కొలను సతీశ్ పాల్గొన్నారు.