యాదాద్రి భువనగిరి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిషరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. సంపూర్ణ రుణమాఫీ డిమాండ్‌తో గురువారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ సగం మంది రైతులకే మాఫీ అవడం వల్ల మిగిలిన వారు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు మానుకుని బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగాల్సి వస్తున్నదని తెలిపారు.
రుణమాఫీ కోసం రూ. 45 వేల కోట్ల అవసరమని అంచనా వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రూ. 31 వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పి.. రూ. 18 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. రేషన్ కార్డులు, ఐటీ రిటర్న్స్, రీ షెడ్యూల్ వంటి వాటిని సాకలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఒక్కసారి కూడా రైతు భరోసా నగదు విడుదల చేయలేదని మండిపడ్డారు. ఆందోళనలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు గౌడ్, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు నాయకులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ , రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.