నీలగిరి, డిసెంబర్10 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్-2 పరీక్షల కోసం 29,118 మంది అభ్యర్థులు హజరగుతున్నారని, అందుకోసం 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో 59 కేంద్రాల్లో 21,777, మిర్యాలగూడలోని 28 కేంద్రాల్లో 7,941 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం ముగ్గురు రీజనల్ కోఅర్డినేటర్స్, 99 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 31 మంది ఫ్లయింగ్ స్కాడ్స్, 17 మంది జాయింట్ రూట్ అఫీసర్లు, 244మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించినట్లు చెప్పారు. రెండు రోజులపాటు స్థానిక సెలవులుగా ప్రకటించినట్లు తెలిపారు.
పరీక్షలు ఉదయం 10 నుంచి 12.30 నిమషాల వరకు మధ్యాహ్నం 3 నుంచి 5.30 నిమిషాల వరకు రెండు సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర నారాయణ అమిత్, డీఆర్ఓ అమరేందర్, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.