భువనగిరి కలెక్టరేట్/ చౌటుప్పల్, సెప్టెంబర్ 18 : చౌటుప్పల్ మండలం మీదుగా వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చి బాధితులకు మారెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలంలో ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అలైన్మెంట్ మార్చి మారెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ధర్నాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు బాధ్యత వహించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు కోసం మిగతా చోట్ల ఔటర్ రింగ్ రోడ్డుకు 42 కిలోమీటర్ల దూరంలో భూ సేకరణ చేస్తుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో 28 కిలోమీటర్ల దూరాన్ని ఎంచుకోవడంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదన్నారు. చౌటుప్పల్ మండలంలో ఎక రం భూమి 2 కోట్లు, పట్టణంలో 4 కోట్లు ఉందని, పరిహారం లక్షల్లో ఇస్తే నిర్వాసిత కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భూమికి బదులు భూమి లేదా మారెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ హనుమంతు కె.జెండగేకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వారికి మద్దతు ప్రకటించి మాట్లాడారు. రైతుల పక్షాన ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు.
అనంతరం ఆర్డీఓ శేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వద్ద ధర్నాకు తరలివెళ్లారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేక అశోక్‌రెడ్డి, మాటూరి బాలరాజుగౌడ్, రైతు ఐక్య వేదిక నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గంగాదేవి సైదులు, బండారు నర్సింహ, ఢిల్లీ మాధవరెడ్డి, పొట్ట శ్రీను, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ గోపగాని లక్ష్మణ్, నాయకులు సురేందర్‌రెడ్డి, శ్రీశైలం, లింగం, నర్సింహ, నిర్మల, భారతమ్మ, నిర్మల, పద్మ, బుచ్చమ్మ పాల్గొన్నా రు. చౌటుప్పల్‌లో సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, నాయకులు గిర్కటి నిరంజన్‌గౌడ్, పెద్దిటి బుచ్చిరెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, గంగాదేవి సైదులు, బండారు నర్సింహ, ఊడుగు మల్లేశంగౌడ్, వెంకటేశం యాదవ్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాములు గౌడ్, బాలరాజు, పర్వతాలు యాదవ్ పాల్గొన్నారు.