నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధీర వనిత చిట్యాల ఐలమ్మ ఉద్యమం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల రజక భవనం వద్ద రజక సంక్షేమ భవన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరగిన పోరాటంలో ఐలమ్మ ముందు భాగాన నిలబడి పోరాడిందన్నారు. ఐలమ్మ ఆనాడు నిజాం నవాబులకు, జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చి తన కుటుంబాన్ని సైతం పోరుబాటలో నడిపిన ఘనత ఐలమ్మకే దక్కిందన్నారు.
ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘బాంచన్ నీ కాల్మొక్తా” అని బతికే రోజుల్లో విసునూరు దేశముఖ్, ఆప్రాంత భూస్వాములకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. అందుకే తెలంగాణ కల సాకారం అయినవేళ అనతి కాలంలోనే ఐలమ్మను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, డీబీసీడీఓ రాజ్ కుమార్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, బీజేపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్, కరీం పాషా, అయితగోని యాదయ్య, జిల్లా కన్వీనర్ పగిల్ల సైదులు, నియోజకవర్గ అధ్యక్షుడు భీమనపల్లి నాగేశ్, రజక భవన కన్వీనర్ చిలకరాజు చెన్నయ్య, గౌరవ సలహాదారు చిక్కుల రాములు, కోశాధికారి దూదిగామ సత్తయ్య, రజక సంఘాల జిల్లా నాయకులు లకడాపురం వెంకన్న, చిలుకరాజు సతీశ్, రెడ్డిపల్లి సాగర్, పట్టణ రజక సంఘాల నాయకులు చింతల వెంకన్న, దామునూరి శ్రీనివాస్, జంజిరాల శేఖర్, ఎలిజాల సత్తయ్య పాల్గొన్నారు.