మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగవుతున్న పంట వరి. అన్ని పంటల కంటే వరి సాగుకు ఎక్కువ నీరు కావాల్సి ఉంటుంది. కిలో వడ్ల ఉత్పత్తికి సుమారు 4- 5 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది మిగిలిన ధాన్యజాతుల కన్నా రెండు, మూడు రెట్లు ఎక్కువ. వరిని పండించే అనేక ప్రదేశాల్లో సాగునీటి కొరత, క్షీణించిన భూ సాంద్రత, ఇతర కారణాల వల్ల ఉత్పాదకత తగ్గుతున్నది. వీటన్నింటినీ అధిగమిస్తూ వరి సాగును మరింత లాభదాయకం చేయడం అవసరం. అయితే.. చాలా మంది రైతులు దమ్ము చేసి నాట్లు వేసే పద్ధతికి ప్రత్యామ్నాయం చూస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో రైతులకు చాలా అనుకూలమైన
విధానమే పొడి దుక్కిలో నేరుగా వరి విత్తనాలను విత్తుకోవడం. ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా వరి సాగు మరింత సులభతరమని, ఖర్చును బాగా తగ్గించుకోవడంతోపాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఆ పద్ధతులు ఎలాగో చూద్దాం.
తక్కువ నీరు ఉపయోగించి పొడి దుక్కిలో నేరుగా వరి
విత్తనాలు విత్తుకుని పండించే విధానాన్ని ఆరు తడి (ఎరోబిక్) వరి సాగు అంటారు. ఎరోబిక్ పద్ధతిలో సాధారణంగా మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేస్తుంటారు. ఈ పద్ధతిలో నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. పొలాన్ని దమ్ము చేయడం, నారుమడి తయారు చేయడం, నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. వరి విత్తనాలను నేరుగా విత్తుకుని ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. ఈ పద్ధతితో రూ.7,500 వరకు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. మిథేన్ వాయువు విష ప్రభావాన్ని తగ్గించవచ్చు. చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. మాగాణి కంటే 7- 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
యాజమాన్య పద్ధతులు అనువైన రకాలు
ఆరు తడి పద్ధతిలో వరిని సాగు చేయడానికి లోతైన వేరు వ్యవస్థ కలిగి, బెట్టను తట్టుకునే స్వల్ప లేదా మధ్యకాలిక రకాలు అనుకూలం. కేఎన్ఎం 118, జేజీఎల్ 24423, కాటన్ దొర సన్నాలు (1010), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), బీపీటీ 5204, సిద్ది (జేజీఎల్ 44) వంటివి అనువైనవి.
భూమి తయారీ
తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుని మెత్తని దుక్కి చేసుకుంటే కలుపు సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. సేంద్రియ ఎరువు గానీ, కంపోస్ట్ ఎరువు గానీ, పచ్చిరొట్ట అవశేషాన్ని గానీ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నేల చదునుగా ఉంటే తేమ సరిగా అంది మొలక సమానంగా వస్తుంది. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉంటుంది.
విత్తన మోతాదు
ఎకరాకు 10- 12 కిలోల విత్తనం సరిపోతుంది. వెదజల్లే పద్ధతి అయితే మరో 2-4 కిలోలు అదనంగా పడుతుంది. విత్తే సమయంలో పొడి విత్తనాన్ని శుద్ధి చేసుకోవడం వల్ల తెగుళ్లను అదుపు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి కార్బండిజమ్ 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తే సమయం
వర్షాలు పడుటకు ముందుగానే పొలాన్ని సిద్ధం చేసి విత్తుకోవాలి. లేదా వాతావరణం పొడిగా ఉండి, భూమి తడిగా లేనప్పుడు మాత్రమే నేరుగా విత్తడానికి అనుకూలం. జూన్ మొదటి వారం నుంచి జూలై రెండో వారం లేదా మూడో వారంలోపు విత్తుకోవాలి. భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే నేరుగా విత్తడం సాధ్యం కాదు.
నేరుగా విత్తుట
శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గానీ, 20 సెంటీమీటర్ల దూరంలో నాగలి సాలు వెనుక గానీ, గొర్రుతో గానీ, ట్రాక్టర్‌తో నడిచే సీడ్ కం ఫర్టిడ్రిల్తో గానీ విత్తుకోవచ్చు. విత్తనాన్ని ఎక్కువ లోతులో వేస్తే మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పై పొరలో పడేలా సుమారు 2.5 – 5 సెంటీమీటర్ల లోతులోనే పడేటట్లు చూసుకోవాలి. నాగలి సాలుతో గానీ, పత్తి అచ్చు గుంటుక సాయంతో గానీ 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకుంటే కలుపు నివారణకు, అంతర కృషికి సులువుగా ఉంటుంది. నాగలి సాలు వెనుక విత్తినప్పుడు ఎక్కువ మోతాదులో విత్తనం పడుతుంది. కాబట్టి రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు అధికంగా ఉన్న మొక్కలను తొలగించాలి.
నీటి యాజమాన్యం
మెట్ట వరి సాగులో నీటి యాజమాన్యం అత్యంత కీలకం. పొలం ఎండిపోకుండా వారానికోసారి నీటి తడులు పెట్టాలి. వానకాలం సీజన్లో తక్కువ తడులతో వరిని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానంలో నీటిని 40- 50 శాతం మేర ఆదా చేసుకోవచ్చు. మాగాణి వరి దిగుబడులతో పోల్చితే ఆరు తడి పద్ధతిలో సుమారు 80 – 90 శాతం అధికంగా పొందవచ్చు.
కలుపు యాజమాన్యం
ఎరోబిక్ వరి సాగులో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు వల్ల 50- 90 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. విత్తిన తర్వాత భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు కలుపు మందు వాడాలి. ఎకరాకు లీటర్ పెండిమిథాలిన్ (30 ఈసీ) లేదా 400 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్ + సేఫనర్ లేదా 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ లేదా 80 గ్రాముల పైరోజోసల్ఫ్యూరాన్ ఈథైల్ వంటి వాటిలో ఏదో ఒక మందును 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై విత్తిన 2, 3 రోజుల లోపు పిచికారీ చేయాలి. విత్తిన 15- 20 రోజులకు కలుపు ఉధృతిని బట్టి గడ్డిజాతి కలుపు మాత్రమే అధికంగా ఉంటే సైహాలోఫాస్ బ్యూటైల్ ఎకరాకు 400 మిల్లీలీటర్లు, వెడల్పు ఆకుజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే 2,4డీ సోడియం సాల్ట్, 400 గ్రాములు, గడ్డి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు సమానంగా ఉన్నప్పుడు బిస్పైరిబాక్ సోడియం (10 ఎస్సీ) 120 మి.లీ., పినాక్సిలమ్ 400 మి.లీ. పిచికారీ చేయాలి. అన్ని రకాల కలుపు మొక్కలు ఉంటే 30 రోజుల తర్వాత ఒకసారి మనుషులతో కలుపు తీయించాలి. సిఫారసు మేరకు కలుపు మందులు వాడుతూ వరుసల మధ్య అంతర కృషి చేయడం ద్వారా వేర్లకు ఆక్సిజన్ బాగా అంది వేరు వ్యవస్థ దృఢంగా ఉండి పంట ఆరోగ్యంగా ఎదుగుతుంది.
ఎరువుల యాజమాన్యం
ప్రధాన పోషకాలను సిఫారసు మేరకు వేయాలి. భాస్వరం మోతాదును పూర్తిగా ఆఖరి దుక్కిలో వేయాలి. పొటాష్‌ను ఆఖరి దుక్కిలో సగ భాగం, మిగిలిన సగం నత్రజని ఎరువుతోపాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నత్రజనిని వరి కంటే సుమారు 25 శాతం అధికంగా వేసుకోవాలి. నత్రజని ఎరువును మూడు దఫాలుగా విత్తిన 15 రోజులకు, పిలక దశలో, అంకురం దశలో వేయాలి. ఏరోబిక్ వరిలో ఇనుపధాతు లోపం, జింక్‌ధాతు లోపం సాధారణంగా వస్తుంది. ఇనుపధాతు లోపం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయినట్లు ఉండి ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే లీటరు నీటికి రెండు గ్రాముల అన్నభేది, రెండు గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరమైతే వారం రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేసుకోవాలి. జింక్ లోపం లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
కూలీల కొరతను అధిగమించవచ్చు
ప్రస్తుత పరిస్థితిలో వరిని నాటు వేయాలంటే కూలీల కొరత బాగా ఉంది. దీంతో రైతులు సకాలంలో నాట్లు వేయలేకపోతున్నారు. దీనిని అధిగమించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు మంచి మార్గం పొడి దుక్కిలో వరి విత్తనాలు జల్లుకోవడం. దీనికి అనేక పద్ధతులు ఉన్నాయి. నేరుగా వెదజల్లవచ్చు, నాగలి సాలు వెనుక గానీ, గొర్రుతో గానీ, సీడ్ కం ఫర్టిడ్రిల్తో గానీ విత్తుకోవచ్చు. ఈ విధానాలను చాలా తేలికగా ఆచరించవచ్చు. అనుకున్న సమయానికి విత్తనాలు విత్తుకోవచ్చు. విత్తనాలు కూడా చాలా తక్కువగా అవసరమవుతాయి. అలాగే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో వరిని సాగు చేయడవచ్చు. సాగు ఖర్చు తగ్గడంతోపాటు మంచి దిగుబడులు పొందవచ్చు.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి