నల్లగొండ, అక్టోబర్ 8 : ఏ రైతు ఏ పంట వేశారో గుర్తించేందుకు డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అడుగుకు ముందుకు పడడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన వ్యవసాయ విస్తరణ అధికారులకు మూకుమ్మడిగా చెయ్యలేమని చెప్పడంతో ఈ పరిస్థితి నెలకొంది. సర్కారు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం ఏఈఓలకు మెమోలు జారీ చేసింది. గత నెల 27 నుంచి ఆబ్సెంట్ వేస్తున్నా ఏఈఓలు సర్వేకు సంబంధించిన యాప్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోకపోవడం గమనార్హం. అందుకు వివిధ కారణాలను ఏకరువు పెడుతున్నారు. ఏడాది కాలంగా రైతు వేదికలకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం తమకు గ్రామాల్లో సహాయకులను నియమించాలని, కొత్త ట్యాబ్‌లు ఇవ్వాలని కోరుతున్నారు. 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించాలనే డిమాండ్ చేస్తూ డిజిటల్ సర్వేను బాయ్‌కాట్ చేస్తున్నారు. గత 27 వరకు విధుల్లో ఉన్నందున అప్పటి వరకు వేతనం తీసుకున్న ఏఈఓలకు ఈ నెల వేతనం ప్రశ్నార్థకంగా మారింది.
పంటల వారీగా సర్వేకు ఆదేశం
ఏడాదిలో రెండు సార్లు వానకాలంతోపాటు యాసంగి సీజన్లో ఏ రైతు ఏపంట వేశారో డిజిటల్ సర్వే ద్వారా గుర్తించి యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగానే గతేడాది రెండు సీజన్లు నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ వానకాలం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో 24.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా, ఆయా ప్రాంతాల్లో సర్వేకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్)యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క ఏఈఓ కూడా యాప్‌ను ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోలేదు. సర్వే చేయాలంటే రైతు పొలానికి కనీసం 25 మీటర్ల నిడివిలో ఉంటేనే నమోదు అవుతుంది. దాంతో తాము క్షేత్రస్థాయికి వెళ్లలేమంటూ ఏఈవోలు డిజిటల్ సర్వేకు ముందుకు రావడం లేదు.
అందరికీ మెమోలు
డిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడంతోపాటు ఏ ఒక్క ఏఈఓ కూడా డీసీఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకపోవటంతో ప్రభుత్వం సీరియస్ అయి అందరికీ మెమోలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రతి ఏఈఓకూ గత నెలలోనే మెమోలు ఇచ్చింది. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆబ్సెంట్ వేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో గత నెల 27 నుంచి జిల్లా వ్యవసాయ శాఖ ఆబ్సెంట్ వేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు నివేదిస్తున్నది. నేడో, రేపో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానుండగా ఏఈఓలు తేమ శాతం చూసేందుకు వస్తారా, లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ వస్తే విధులకు హాజరు అవడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా, ఆబ్సెంట్ వేస్తుందా అనేది చూడాల్సి ఉంది.
డిమాండ్లు నెరవేరిస్తేనే చేస్తామని ప్రకటన
రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోళ్లతోపాటు అనేక పనుల్లో భాగస్వామ్యం చేస్తున్న తమను డిజిటల్ సర్వే పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు గ్రామాల్లో పూర్తి స్థాయిలో సర్వే నెంబర్లపైనే అవగాహన లేదని, 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమిస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం ఒక్కొక్క ఏఈఓకు 10 నుంచి 15 ఎకరాల పరిధిని కేటాయిస్తే ఎలా చెయ్యగలమని ప్రశ్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో తమకు ఒక సహాకుడిని నియమించడంతో పాటు కొత్త ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు వేదికలకు ఇవ్వాల్సిన ఏడాది నిధులు(నెలకు రూ.9వేలు) వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 280 మంది ఏఈఓలు ఉన్నారు. మరో 150 మందికిపైగా ఏఈఓల అవసరం ఉన్నట్లు చెప్తున్నారు.
ప్రభుత్వ ఆదేశం మేరకు నిర్ణయం
ప్రభుత్వం ఈ సీజన్‌కు సంబంధించి డిజిటల్ సర్వే చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఏఈఓలు అందుకు సంబంధించిన పనులు ప్రారంభించ లేదు. దాంతో ప్రభుత్వ ఆదేశానునుసారం అందరికీ మెమోలు ఇచ్చాం. వారి నుంచి సమాధానం లేకపోవడంతో గత నెల 27 నుంచి ఆబ్సెంట్ వేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయాలు ఉంటాయి.
-పాల్వాయి శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, నల్లగొండ