నల్లగొండ, జూన్ 17: నార్కట్పల్లి మండలం దాసరిగూడెం పరిధిలోని రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు , గృహాల వేలం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన రెండో విడుత ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 253 ఓపెన్ ప్లాట్లు , 363 గృహాలు ఉన్నట్లు తెలిపారు. ఓపెన్ ప్లాట్లకు గజానికి రూ.7 వేల ధర నిర్ణయించగా నిర్మాణ దశలో ఉన్న గృహాలకు రూ.7 నుంచి రూ.12,500 వరకు నిర్ణయించినట్లు చెప్పారు. కలెక్టర్ పేరు మీద రూ.10వేల ఈఎండీ చెల్లించి భౌతిక వేలంలో పాల్గొనాలని సూచించారు. కలెక్టరేట్లో దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ టౌన్ షిప్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, విద్యుద్ధీకరణ, మంచి నీటి సరఫరా, సీవరేజ్, అవెన్యూ ప్లాంటేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, డీఎం సివిల్ సప్లయ్ నాగేశ్వర్రావు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ జీఎం షఫీ పాల్గొన్నారు.
నల్లగొండ, జూన్ 17: మన ఊరు-మన బడి భాగంగా గుర్తించిన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఆయా శాఖల అధికారులతో ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతగా 517 పాఠశాలలను ఎంపిక చేసి 132పాఠశాలలకు నిధులు విడుదల చేసినందున ఆ పాఠశాలల్లో ఇంకా ఎందుకు పనులు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు.
ఈ పథకంలో నల్లగొండ చివరి స్థానంలో ఉన్నందున నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నల్లగొండ, మునుగోడు నియోజకవర్గంలో పనుల ప్రగతి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రగతి పనులు ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాలని, సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓలు జగదీశ్వర్ రెడ్డి, గోపీరాం, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, బీసీడీఓ పుష్పలత, పీఆర్ఈఈ తిరుపతయ్య పాల్గొన్నారు.