నల్లగొండ, జనవరి 31 : ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్ మన్) కార్యక్రమం కింద ఆదివాసీ చెంచు సమూహాలను అభివృద్ధి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పీఎం-జన్మన్ కింద జిల్లా వ్యాప్తంగా నాలుగు మండలాల్లోని ఎనిమిది చెంచు హ్యాబిటేషన్లో చేపట్టే కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు ఎనిమిది అనుబంధ మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాలు అమలు చేస్తాయని అన్నారు.
ఈ పథకం 2023-24 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అమలులో ఉంటుందని తెలిపారు. మొత్తం పదకొండు కీలకమైన అంశాలపై దృష్టి సారించి రూ.24.10 కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలోని తిరుమలగిరి సాగర్, చందంపేట, గుండ్లపల్లి, నేరేడుగొమ్ము మండలాల పరిధిలోని నెల్లికల్, చిత్రియాల, గోనబోయిన పల్లె, కంబాలపల్లి, రేకుల వలయం, పొగిళ్ల, తిమ్మాపూర్, గన్నేరులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెంచు జనాభాకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, అర్డీఓ రాములు(దేవరకొండ), చెన్నయ్య(మిర్యాలగూడ), సంబంధిత అధికారులు పాల్గొన్నారు.