నల్లగొండ రూరల్, జులై 09 : నమస్తే తెలంగాణ దినపత్రిక నల్లగొండ జిల్లా పేజీలో బుధవారం ప్రచురితమైన ముషంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు నిల్.. అనే కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలోని నీళ్ల హౌజ్‌ను పరిశీలించడంతో పాటు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల గ్రాంట్ నుంచి తక్షణమే మోటార్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే బాల బాలికలకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల విద్యాధికారి విధిగా పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో కాసేపు విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు బోధించారు. ఆమె వెంట నల్లగొండ ఎంపీడీఓ సిరిపురం వెంకట్‌రెడ్డి, ఎంఈఓ అరుంధతి, పాఠశాల హెచ్ఎం ప్రమీల, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షఫీయుద్దీన్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఉన్నారు.