మునుగోడు, మార్చి11 : గ్రామాల్లో ఇప్పటికీ ఉపాధి హామీ పనులను కల్పించని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య అన్నారు. పనులను వెంటనే ప్రారంభించి కూలీలకు ఉపాధి కల్పించాలన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులను ఎక్కువ గ్రామాల్లో కల్పించడం లేదన్నారు. ప్రధానంగా ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పనులు లభించక అనేకమంది పేదలు వలస బాట పడుతున్నట్లు తెలిపారు.
పలు గ్రామాల్లో పని కల్పించాలని కూలీలు ఒత్తిడి తెచ్చినా సిబ్బంది పట్టించుకోని దుస్థితి ఏర్పడిందన్నారు. అడిగిన వెంటనే పని కల్పించాలని చట్టంలో ఉన్నా కేవలం కొంతమందికే ఉపాధి హామీ పనులు కల్పిస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి పేదలకు ఉపాధి హామీ లేకుండా చేసే కుట్ర పూనుకుందని అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ రావడమే నిదర్శనమన్నారు. కేంద్ర బడ్జెట్ లో రెండున్నర లక్షల కోట్లు అవసరం ఉండగా కేవలం రూ.83 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే కావాల్సిన నిధుల్ని కేటాయించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే జాబు కార్డు లేని వారందరికీ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశాల్లో కూలీలకు టెంట్లు, మంచినీరు, మెడికల్ కిట్టు సౌకర్యం ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని అడిగినా పని కల్పించని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కూలీలను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం, ఫీల్డ్ అసిస్టెంట్ పరమేశ్, వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ అధ్యక్ష కార్యదర్శులు సింగపంగా ఎల్లయ్య, కట్టా ఎల్లమ్మ, సంఘ నాయకులు పగిళ్ల మల్లేశ్, సింగపంగా సుగుణమ్మ, చిలుకూరి చిన్న, యాదమ్మ, చేకూరి కావ్య, పులకరం కనకమ్మ పాల్గొన్నారు.