నిడమనూరు, జూలై 21 : నిడమనూరు మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి గ్రామంలో అక్రమ పద్ధతిలో బిల్లులు వసూలు చేసి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేశ్ ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో వారు మాట్లాడారు. గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఇంటి పన్ను బకాయిలను వసూలు చేసి రెండు సంవత్సరాలకు సంబంధించి బిల్లులు చెల్లించినట్టు రసీదులు ఇచ్చారన్నారు. ఇంటి పర్మిషన్, డెత్ సర్టిఫికెట్, పంచాయతీ ట్రాక్టర్ రిపేర్, ఇంటి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఇలా ప్రతీ దాంట్లో అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిపారు. వసూలు చేసిన డబ్బులను గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా భాగాలు పంచుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్మికులను దళితులనే చిన్న చూపుతో హేళన చేస్తూ మాట్లాడుతున్నట్లు తెలిపారు. వారిపై పని ఒత్తిడి పెంచుతూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. పంచాయతీ కార్మికుల పట్ల వివక్ష, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వసూలు చేసిన నిధులను రికవరీ చేసి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని వారు కోరారు. లేకుంటే జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ మండల కమిటీ సభ్యుడు కుంచెం శేఖర్ ఉన్నాడు.