– కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వినతి
నల్లగొండ సిటీ, మే 20 : పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాల విషయాన్ని ఆధారాలతో సహా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బుధవారం కలెక్టర్ బి.చంద్రశేఖర్‌కు అందజేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామంలోని ధాన్య సేకరణ కేంద్రంలో రెండు రకాల ట్రక్ షీట్లతో రైతులను మోసం చేస్తున్నారని, రైతులకు ఇచ్చే ట్రక్ షీట్లో ఒక రకమైన తూకం, మిల్లర్ దగ్గర నుండి మరో రకమైన తూకంతో ట్రక్ షీట్లు ఇస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు కలెక్టర్ కు అందజేసి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం, తిప్పర్తి, ఇండ్లూరు, మామిడాల తదితర ధాన్య సేకరణ కేంద్రాలకు బయటి రాష్ట్రం నుండి ధాన్యం వస్తుందని స్థానికంగా ఉన్న నాయకులు ధాన్యం సేకరణ నిర్వాహకులతో కుమ్మక్కై ఆ ధాన్యాన్ని కొంటున్నట్లు తెలిపారు.
దీనిపై తమ పార్టీ నాయకులు ఆధారాలతో బయటపెట్టినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని కలెక్టర్ కు తెలియజేశారు. అదేవిధంగా నల్లగొండ మండలం అన్నపర్తి ధాన్య సేకరణ కేంద్రాల్లో ఇంతవరకు 25 శాతం కొనుగోళ్లు కూడా జరుపలేదని, కలెక్టర్ వెంటనే వీటిపై స్పందించి తగు చర్యలు తీసుకుని ధాన్య సేకరణను వేగవంతం చేయాలని కోరారు. కలెక్టర్ వీటన్నిటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, అన్నెపర్తి సర్పంచ్ మేక అరవింద్ రెడ్డి, మాజీ సర్పంచులు ఎలుక శ్రీనివాస్ రెడ్డి, కోట్ల జైపాల్ రెడ్డి, పెఱిక కరుణ్ జయరాజ్, ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.