– నాస్ ఫార్మాసిటికల్ అగ్ని ప్రమాదంపై విచారణకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశం
– క్షేత్రస్థాయిలో పరిశ్రమ పరిశీలన
నల్లగొండ, ఏప్రిల్ 10 : చిట్యాల ప్రాంతంలో ఉండే పరిశ్రమలు చుట్టుపక్కల ప్రజలు, కార్మికులు కాలుష్యం బారిన పడకుండా చూడడంతో పాటు వారి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందని, ఎవరి ప్రాణాలకు హాని కలిగినా యాజమాన్యంపై చర్యలు ఉంటాయని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ హెచ్చరించారు. ప్రత్యేకించి పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల భద్రత చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా యాజమాన్యంపై ఉందని, అలాగే పర్యావరణాన్ని సైతం ఎప్పటికప్పుడు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని నాస్ ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్లో గురువారం రాత్రి రియాక్టర్ వద్ద సంభవించిన అగ్రి ప్రమాదంలో ఉద్యోగులు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ కుమార్ గాయపడ్డారు. వీరిని హైదరాబాద్ లోని డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రభుత్వ విప్ వీరేశం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక శాఖ, స్థానికర తాసీల్దార్, ఎంపీడీఓ ప్రమాద సంఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతేకాక నాస్ కంపెనీకి ఉన్న అనుమతులపై నివేదిక ఇవ్వాలని, ఉద్యోగుల భద్రత పట్ల తీసుకున్న చర్యలపై పోలీసులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆస్పత్రి వారితో మాట్లాడడం జరుగుతున్నదని, అంతేకాక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఉద్యోగుల కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంపెనీ తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, చిట్యాల తాసీల్దార్ విజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘ఎవరి ప్రాణాలకు హాని కలిగినా యాజమాన్యంపై చర్యలు’