పెన్‌పహాడ్, ఏప్రిల్ 09 : పెన్‌పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన నర్సింగోజు కనకాంబర చారి చిన్న కుమారుడు నిఖిల్(14) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఒంటి పుట బడులు కావడంతో బుధవారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులో తాటి ముంజలు కోసేందుకు తన స్నేహితులు పర్వతం మణికంఠ చారి, షేక్ పజిద్ తో కలిసి ఐరన్ పైప్ కు కొడవలి కట్టి తీసుకెళ్లాడు. తాటిముంజలు కోస్తున్న సమయంలో ఐరన్ పైపు బరువు ఎక్కువ కావడంతో సమీపంలోని హై టెన్షన్ కరెంట్ వైర్ కు తగిలింది. దీంతో పైప్‌కు విద్యుత్ సరఫరా కావడంతో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న మణికంఠకు గాయాలయ్యాయి. నిఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపికృష్ణ కేసు నమోదు చేశారు.