– సూట్‌కేస్‌తో వచ్చిన ఆయనకు నేడు వేల కోట్ల సంపాదన
– రాజేష్ హత్య ముమ్మాటికి ఉత్తమ్ దంపతుల పుణ్యమే
– ఉత్తమ్‌ను మంత్రివర్గ నుండి తొలగించేదాకా వదిలిపెట్టేదే లేదు
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 27 : నాడు గృహ నిర్మాణ శాఖ నుండి నేడు పౌర సరఫరాల, భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గ నుండి బర్తరఫ్ చేసేదాకా ఇక యుద్ధమేనని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కోదాడలోని ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ అవినీతి అంశంలో తనను అభాసుపాలు చేసేందుకే దళిత బిడ్డ రాజేష్ ను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపిన దుర్ఘటనలో ప్రధాన బాధ్యుడైన తమ సామాజిక వర్గానికి చెందిన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుకునేందుకు ఉత్తమ్ దంపతులు వడిగట్టారని విమర్శించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధారాలతో సహా రిమాండ్ లోనే పోలీసులు చంపారని నిరూపించినప్పటికీ, ఇప్పటివరకు ఎస్ఐ ని సస్పెండ్ చేయకపోవడం శోచనీయమన్నారు.
తక్షణమే వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మంత్రివర్గ నుండి తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తాను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికు లేఖ పంపినట్టు తెలిపారు. అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, వాట్సాప్ గ్రూపులో వ్యక్తిగత మెసేజీలు పెడుతూ బీఆర్ఎస్ నేతలను కించపరుస్తూ తన బాధ్యత మరచినందునే పట్టణ సీఐపై ఇప్పటికే తాను ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. 1994లో ఒక సూట్ కేసుతో కోదాడకు దిగుమతి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు వేల కోట్లు ఎలా సంపాదించారో అంతా అర్థం చేసుకోవాలన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి నుండి నేడు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రిగా అక్రమార్జనతో వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. ఇప్పుడు మంత్రి అయిన తొలి రోజుల్లోనే మిల్లర్ల నుండి రెండు వేల కోట్లు ముక్కు పిండి వసూలు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన చేసిన అవినీతిపై తమ వద్ద ప్రతిదానికి సాక్షాదారాలు ఉన్నాయని, ఆయనను మంత్రి పదవి నుండి తొలగించేదాకా వదిలిపెట్టనన్నారు.
తన జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. గత 20 సంవత్సరాల కాలంలో రాజకీయాల్లో కోట్ల రూపాయలు నష్టపోయానే కానీ ఎక్కడా మచ్చ పడలేదు అన్నారు. అవినీతి అంశంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. మంత్రి తన అవినీతిని ప్రశ్నించకుండా, దళిత బిడ్డ రాజేష్ దుర్మరణంపై తమ దంపతులపై వస్తున్న ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకు తమ పార్టీ అనుచరులతో దిష్టిబొమ్మలు తగలబెట్టిస్తున్నారని, ఇదేమి తనకు కొత్త కాదన్నారు. కోదాడలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు ఆయన చేయని కుట్ర లేదన్నారు. ఈ కుట్రలకు, ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదన్నారు. ఆంబోతులతో కొట్లాడితే లేగ దూడలే మరణిస్తాయనే వాస్తవాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకుని వ్యవహరించాలన్నారు. అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు మధ్యవర్తులతో బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా దిగజారాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హాయంలో ఆయకట్ట చివరి ప్రాంతమైన మోతే, నడిగూడెం, మునగాల వరకు ఎస్సారెస్పీ నీళ్లతో బీడు భూములు సస్యశ్యామలమైతే.. నీళ్ల మంత్రిగా ఉన్న ఉత్తమ్ పాలనలో నేడు నేలమర్రి తదితర గ్రామాల్లో తిరిగి బోర్లు వేసుకుని దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, కర్ల సుందర్ బాబు, శెట్టి సురేష్, భాగ్యమ్మ, నరసింహారావు పాల్గొన్నారు.