నీలగిరి, జూన్ 7 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిన నైతిక విజయం తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్ హాల్లోని మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం, హేమహేమీలైన మంత్రులు ఉన్నా గట్టి పోటీ ఇచ్చామన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యన ఉంటూ వారికోసం పనిచేస్తానని తెలిపారు. పార్టీలకతీతంగా తనకు ఓట్లు వేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఇతర పార్టీలో ఉండి కూడా తనకు సహకరించిన వారు, వివిధ వర్గాల ప్రజలు నా విజయం కోసం ఎదురు చూశారన్నారు. వారి అశలను అందుకోలేకపోయానని తెలిపారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు కూడా తన గెలుపు కోసం కృషి చేశారని, అయినా ఓడిపోవడం చాలా బాధగా ఉందని చెప్పారు. 12 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని, బీఆర్ఎస్లో అవకాశం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌కు, తన వెన్నంటి నిలిచిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ సమయంలో ఇంతటి ట్రెండ్ సృష్టించి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రులకు ఇచ్చిన హామీలపై ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తానన్నారు. బీఆర్ఎస్ పని అయిపోందని చెప్పిన వారందరికీ ఇది ఒక కనువిప్పు అని తెలిపారు.