– వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకులు
– పద్యంలో కవచం.. గద్యంలో భరతారావు దిట్ట
– రేపు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
కోదాడ, ఆగస్టు 02 : కోదాడలోని కే ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా మూడు దశాబ్దాలు వేలాది మంది విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం నేర్పిన శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, మంత్రిప్రగడ భరతారావు మాస్టార్ల స్నేహ బంధం ఐదు దశాబ్దాలుగా కొనసాగుతుంది. 1970లో కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా వీరు బాధ్యతలు చేపట్టారు. హుజూర్నగర్ పక్కనే ఉన్న లింగగిరి, లకారం గ్రామాలు వీరి స్వస్థలాలు. తొలుత వీరిరువురు ఉపాధ్యాయులుగా వేర్వేరుగా విధులు నిర్వహించినప్పటికీ కళాశాలలో చేరిన నాటి నుండి నేటి వరకు వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. శ్రీరామ కవచం సార్ పద్యంలో దిట్టయితే, భారతారావు సార్ గద్యంలో దిట్ట. సద్విమర్శతో విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా బోధించేవారు. ఏమాత్రం బేషజాలు లేని వీరు ఎప్పుడో యూనివర్సిటీలలో ఆచార్యులుగా వెళ్లాల్సిన వారు కోదాడలోనే ఉంటూ విద్యార్థులకు తెలుగు భాష మమకారాన్ని రంగరించారు. ఇంకా విస్తుగొలిపే అంశం ఏంటంటే ఉత్తమ అధ్యాపకులుగా సంపూర్ణ అర్హతలు ఉన్నప్పటికీ ఎన్నడూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోకపోవడం వీరి నిబద్ధతకు సాక్షి భూతం.
కోదాడ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కె ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కవచం సార్ సైకిల్‌పై వెళ్తుంటే ఆయన పక్కనే భరతారావు సార్ వడివడిగా అడుగులు వేస్తూ వేగంగా నడిచేవారు. ఈ ప్రయాణం ఒకటి రెండు రోజులు కాదు, 21 సంవత్సరాలు కొనసాగింది. సాహిత్య సమావేశాల్లోనూ ఇద్దరు కలిసే పాల్గొనేవారు. కవచం సార్ పద్య రచన ప్రావీణ్యంతో నీలకంఠీయం, ఆత్మనివేదన, ఖాళీయ మర్దనం తదితర రచనలు చేస్తే.. ఇక భరతారావు సార్‌కి ఉపన్యాసాలు ఇవ్వడంలోను, సాహితీ విమర్శకుడిగా మంచి పేరుంది. కవి సమ్మేళనాలలో కూడా కలిసే పాల్గొనేవారు. వీరిరువురికి తెలుగు భాషలో ఎంత ప్రావీణ్యం ఉందో ఆంగ్లంలోనూ అంతే పట్టు ఉండటం చెప్పుకోదగ్గ అంశం. ఇప్పటికీ వారానికి ఒకసారి అయినా కలుసుకోవడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం చేస్తుంటారు. శుభకార్యాలకు కలిసి వెళ్లడం పరిపాటి అని చెప్పవచ్చు. నిజమైన స్నేహానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని వెతుకుతున్న నేటి పరిస్థితుల్లో కవచం, భరతారావు మాస్టార్ల ఐదు దశాబ్దాల అవ్యాజానుబంధం రోల్ మోడల్ అని చెప్పవచ్చు.