రామన్నపేట, డిసెంబర్19: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో ప్రజారోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించి రెండు నెలలు కావస్తున్నా నేటికీ ఎలాంటి ప్రకటనా చేయకుండా ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అదానీతో లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి, ఈడీ కేసు నుంచి మంత్రి పొంగులేటి బయట పడేందుకు మోదీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. సోనియా, రాహుల్ గాంధీ మొట్టికాయలు వేస్తే ఫోర్త్ సిటీ కోసం అదానీ నుంచి తీసుకున్న రూ.100కోట్లు వాపస్ ఇచ్చానని ప్రకటించుకున్నాడు తప్ప లోలోపల తీసుకున్న డబ్బులకు లెక్కలేదన్నారు. రామన్నపేటలో అదానీ కొనుగోలు చేసిన భుమూల చుట్టూ ఉన్న సర్వే నంబర్ 584లోని 127 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదలాయించి, అటునుంచి అదానీకి అప్పగించే కుట్ర జరుగుతుందన్నారు.
అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోర్టుల నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం మరోచోట స్థల పరిశీలన ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనావాసం మధ్య నిర్మించాలని చూస్తున్న అంబు జా సిమెంట్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకమన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేకమార్లు స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నారు. రామన్నపేటను మరో లగచర్లగా మారక ముందే అంబుజా సిమెంట్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు, రైతులతో కలిసి ఎలాంటి పోరాటానికైనా తాము వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, గొరిగే నర్సిం హ, పున్న వెంకటేశం, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, ఎస్కే చాంద్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి జాడ సంతోశ్ పాల్గొన్నారు.