యాదగిరిగుట్ట, ఆగస్టు 26 : యాదగిరిగుట్ట కొండపైన డోనర్ సెల్‌ను ఆలయ అధికారులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేకంగా నిర్మించారు. మాఢవీధుల్లోకి లిప్టు, రథశాల మధ్యలో సుమారుగా 300 ఎస్ఎఫ్టీలో దాతలు అందజేసే సహాయాన్ని స్వీకరించేందుకు ప్రత్యేక హాల్ నిర్మించారు. గతంలో పశ్చిమ రాజగోపురం పక్కనే అష్టభుజి ప్రాకార మండపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయగా దాతలకు కనిపించకుండా ఉండటంతో పాటు సరిపడా స్థలం లేకుండా ఉంది.
ఈ పరిస్థితిని గమనించిన దేవస్థాన అధికారులు మాఢవీధుల్లో భక్తులకు కనిపించే విధంగా విశాలమైన హాల్‌ను నిర్మించగా అందుబాటులోకి రానుంది. పై భాగంలో స్వామివారి ప్రతిమతోపాటు ఇరువైపులా ద్వారపాలకుడు, గరుత్మండుడి ప్రతిమలను, కింది భాగంలో ఐరావతాలు, దర్వాజలకు పద్మాలు, ఇరువైపులా యాళీ ఫిల్లర్లను అమర్చి అద్భుతంగా తీర్చిదిద్దారు.