మఠంపల్లి, ఏప్రిల్ 16 : తెలుగు నాటకాలు క్రమంగా తెరమరుగవుతున్నాయని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా ప్రభుత్వాలు తెలుగు నాటక రంగాలను చేరదీసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గుర్తింపు తీసుకురావాలని హుజూర్నగర్ నియోజకవర్గ కళాకారుల సంఘం అధ్యక్షుడు బోనగిరి ప్రకాశ్‌బాబు కోరారు. తెలంగాణ నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలోని కళాకారుల భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నవయుగ తెలుగు నాటక ప్రయుక్త, కవి, రచయిత, పంతులు డాక్టర్ కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకుని నటరాజస్వామికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నాటక రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు.
వీధి నాటకాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలపై కూడా ప్రజలు ఆసక్తిని చూపుతున్నారని, ఈ నాటకాలను ప్రదర్శించేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఉత్సాహం చూపుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నాటకాలకు క్రేజ్ పెరిగిందని, కొందరు యువకులు, పెద్దలు శిక్షణ తీసుకుని మరీ వివిధ పాత్రలు, సన్నివేశాలు నటించి గ్రామస్తులను ఆకట్టుకుంటున్నట్లు చెప్పారు. నాటకాలను ప్రోత్సహించి, కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కళాకారుల సంఘం ఉపాధ్యక్షుడు భద్రంరాజు వెంకట రామారావు, సీనియర్ కళాకారులు బత్తిని ధర్మ గౌడ్, షేక్ సైదులు, బొమ్మనబోయిన వెంకట శివ, చిన్నపొంగు విజయ్, జాల కిరణ్ యాదవ్, బొజ్జ సైదులు, రాజు, మామిడి వీరస్వామి, చింతకాయల శ్రీనివాస్ యాదవ్, మల్లెబోయిన గోపయ్య, జూలు వెంకటేశ్వర్లు, యామారపు పకీర, రామలింగయ్య, కళాకారులు, నాయకులు పాల్గొన్నారు.