‘ఏది జరిగినా నేనే చూ సుకుంటాను. నాకు ఎదురే లే దు. నేను చెప్పిందే వేదం’ అంటూ ఏకం గా 12 ఉద్యోగాలను రూ.2 లక్షల చొప్పున తీసుకొని రూ. 24 లక్షలకు విక్రయించుకున్నారు. అవేదో పర్మినెంట్ ఉద్యోగాలై.. రూ.యాభై వేలకు పైనే వేతనాలు వచ్చేవి అనుకుంటే పొరపాటే. కేవలం రూ.16 వేల నుంచి రూ.18 వేల జీతాలు వచ్చే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు.
సూర్యాపేట, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఓ సీనియర్ అసిస్టెంట్ ఈ నిర్వాకానికి ఒడిగట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉద్యోగాలను తెగనమ్ముకునే ఘనుల వ్యవహారం కాస్త బయటకు పొక్కి హైదరాబాద్ దాకా ఫిర్యాదులు వెళ్లడంతో ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అసలే సూర్యాపేట జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మార్చిలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఫైనల్ చేయకపోవడంతో ఆరు నెలలుగా సుమారు 1600 కుటుంబాలు నానా అవస్థలు పడుతుంటే అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు.
ఇప్పటికే ఈఎస్ఐ లాబ్స్ కాగా పీఎఫ్ చెల్లించాలంటే తడిసి మోపెడు అవుతుంది. ఈ తతంగం ఇలా ఉంటే… ఇటీవల అధికారులు తమ విచక్షాణాధికారాలతో అనర్హులకు ఏజెన్సీలను కట్టబెట్టగా కొందరు కోర్టుకు వెళ్లడంతో అవి రైద్దె మళ్లీ మొదటికి చేరుకుంది. ఇలా ఉన్నతాధికారులు తప్పులు చేస్తుంటే వారినే ఆదర్శంగా తీసుకొని కిందిస్థాయి ఉద్యోగులు తామేమన్నా తక్కువ తిన్నామా… అంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్కు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదిహేను రోజుల క్రితం కోర్టులో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు కాకముందు ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఓ సీనియర్ అసిస్టెంట్ పన్నెండు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అన్నీ తానై తీసుకున్నట్లు తెలిసింది. తనకు మంత్రి తెలుసు… కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకున్నాను… ఎవరేం చేయలేరు… కొత్త ఏజెన్సీలో మీ పేర్లు నమోదు చేయిస్తాను అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున రూ.24 లక్షలు వసూలు చేసినట్లు ఆసుపత్రి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విచిత్రమేంటంటే ఇప్పటికే దవాఖానలో ఉద్యోగాలు చేసే వారికి సమీప బంధువులతో పాటు ఇతరులను రిక్రూట్ చేయగా దాదాపు పదిహేను రోజుల పాటు ఉద్యోగాలు కూడా చేశారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ ఆసుపత్రి అధికారి చెప్పారు. విషయం ఆనోటా ఈనోటా బహిర్గతం కావడం… ఏకంగా హైదరాబాద్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ జాయింట్ డైరెక్టర్ వరకు ఫిర్యాదులు వెళ్లడంతో విషయం సీరియస్ అయినట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి దవాఖానలో విచారణ చేసి వెళ్లారని, దీంతో నాలుగు రోజులుగా ఉద్యోగులు విధులకు రావట్లేదని ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది. ఉన్నతాధికారులే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కక్ష కట్టినట్లు కనిపిస్తుండడంతో ఆసుపత్రిలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తారా లేక గాలికి వదిలేస్తారా అనేది వేచి చూడాలి.