నందికొండ, ఆగస్టు 11 : శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను 26 నుంచి 8 క్రస్ట్ గేట్లకు తగ్గించి నీటి విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే వాహనాలు డ్యామ్‌కు వద్దకు బారులుదీరాయి. దాంతో ట్రాఫిక్‌కు ఆటంకంగా మారింది. వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లు తగ్గించినా జనం రద్దీ మాత్రం తగ్గలేదు.
పర్యాటకులు డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా జాలువారుతున్న కృష్ణమ్మ అందాలను వీక్షిస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. వరద ఉధృతి నేపథ్యంలో ఆదివారం కూడా లాంచీలను నాగార్జునకొండకు, జాలీ ట్రిప్పులను నడుపలేదు. సాగర్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నా కనీస సౌకర్యాలను అధికారులు చేపట్టడం లేదు. మంచి నీరు ఎక్కడా అందుబాటులో లేదు. మల విసర్జనకు టాయిలెట్స్ లేవు. కొందరు మంచి నీరు దొరుకక రాతి పొరల నుంచి వస్తున్న డ్యామ్ లీకేజీ వాటర్‌ను పట్టుకొని తాగారు.
1.20 లక్షల ఇన్‌ఫ్లో
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ డ్యామ్‌కు శనివారం 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగగా, ఆదివారం నాటికి 1,20,528 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో డ్యామ్ క్రస్ట్ గేట్లను 26 నుంచి 8 గేట్లకు తగ్గించారు. 63,120 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులలోకి ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో ఆల్మట్టికి 50,000, నారాయణపూర్‌కు 25,000, జూరాలకు 90,000, తుంగభద్రకు 36,739, శ్రీశైలానికి 2,25,744 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.
తుంగభద్రకు ఇన్‌ఫ్లో తగ్గినా డ్యామ్ 19వ గేట్ ఊడిపోవడంతో 55,327 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వస్తున్నది. ఎగువన ఇన్‌ఫ్లో లేకున్నా తుంగభద్ర గేట్ ఊడిపోయినందున మరో 20 టీఎంసీల వరకు నీరు శ్రీశైలం మీదుగా నాగార్జునసాగర్‌కు చేరనున్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగానూ ప్రస్తుతం 588.00 (306.1010 టీఎంసీలు) అడుగులు ఉన్నది. క్రస్ట్ గేట్లతోపాటు ఎడమ కాల్వ ద్వారా 8,454, కుడి కాల్వ ద్వారా 741, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,557, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. సాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 1,03,972 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నది.
రెండు గేట్ల ద్వారా పులిచింతల నీటి విడుదల
చింతలపాలెం : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పులిచింతల ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175.00 (45.77 టీఎంసీలు) అడుగులకు గానూ ఆదివారం రాత్రి 8 గంటల వరకు 167.026(34.284టీఎంసీలు) అడుగులు ఉన్నది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు 72,958 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి 32,638, జెన్కో గేట్ల ద్వారా 16,000, మొత్తం 48,638 క్యూసెక్కుల అవుట్ ఫ్లో విడుదల చేస్తున్నారు. తెలంగాణ జెన్‌లో 16000 క్యూసెక్కుల నీటితో 4 యూనిట్లను రన్ చేస్తూ 70 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్కో ఎస్ఈ దేశ్యా నాయక్ తెలిపారు.