చికెన్ అంటే ఇష్టపడే వారు చాలామందే ఉన్నారు. కొంత మంది వారంలో రెండు, మూడు సార్లు చికెన్‌ను తింటారు. అయితే రెండు నెలల క్రితం చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో కిలో రూ.300దాటింది. రెండు నెలల క్రితం కిలో డ్రెస్స్డ్ చికెన్ రూ. 240, స్కిన్లెస్ రూ.260, బోన్‌లెస్ రూ.480, లైవ్ రూ.140గా ఉంది. కానీ ఇటీవల చికెన్ ధరలు తగ్గుతూ 70 శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుతం భువనగిరిలో కిలో డ్రెస్స్డ్ చికెన్ రూ.135, స్కిన్లెస్ రూ.160, బోన్‌లెస్ రూ.320, లైవ్ బర్డ్ రూ.70గా ఉంది. దాంతో మాంసం ప్రియులు ఖుష్ అవుతున్నారు.
చికెన్ ధరలు తగ్గడానికి వ్యాపారులు పలు కారణాలు చెబుతున్నారు. కోళ్లు ఒక సైజ్ వరకు వచ్చిన తర్వాత కచ్చితంగా అమ్మాల్సి ఉంటుంది. లేకుంటే వాటికి మేత ఎక్కువవడంతోపాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ తగ్గి, కోళ్లు భారీగా రావడంతో సాధారణంగా ధర తగ్గింది. ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ బాగా ఉంటుందని వ్యాపారులు పెద్ద ఎత్తున సీడ్ వేశారు. తీరా ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో కోళ్లు అమ్ముడుపోలేదు. ఎన్నికల సమయంలో అంతో ఇంతో ధర పలికినా.. ఎలక్షన్లు ముగియడంతో ధర పడిపోయింది. దాంతో పాటు ప్రస్తుతం కార్తిక మాసం నడుస్తున్నది. ఈ నెలలో పూజలతోపాటు అయ్యప్ప, భవాని, శివ భక్తులు మాంసానికి దూరంగా ఉండటంతో అమ్మకాలు తగ్గాయి.
చికెన్ ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. రెండు నెలల క్రితంతో పోలిస్తే 50 నుంచి 70 శాతం వరకు రేట్లు పడిపోయాయి. దాంతో అమ్మకాలు కూడా తగ్గాయి. ఎన్నికల్లో ఎక్కువగా సేల్ అవుతుందని వ్యాపారులు అధిక మొత్తంలో సీడ్ వేశారు. కానీ అనుకున్న స్థాయిలో విక్రయాలు జరుగలేదు. కార్తికమాసం, మాలధారణలతో కూడా మాంసం అమ్మకాలు తగ్గాయి. కిరాయిలు, లేబర్‌కు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం.
– రత్న దిలీప్, చికెన్ వ్యాపారి, భువనగిరి
ధరలు, అమ్మకాలు పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రోజు రోజుకు ధరలు తగ్గుతుండడంతో నష్టాల పాలవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉత్పత్తి భారీగా పెంచారు. లక్ష పిల్లలకు బదులు రెండు లక్షల ఉత్పత్తి పెరిగింది. కానీ లక్ష కూడా అమ్ముడుపోక పోవడంతో ఫౌల్ట్రీ వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాభాలు రావడం పక్కనపెడితే.. రెండింతలు నష్టాలు వచ్చాయని వాపోతున్నారు. ఇక చికెన్ అమ్మకం దారులదీ ఇదే పరిస్థితి. గిరాకీ లేక రోజంతా ఖాలీగా కూర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాయిలు, లేబర్, ఇతర ఖర్చులు సొంతంగా భరించాల్సి వస్తుందని చెబుతున్నారు. కాగా కార్త్తిక మాసం ముగిశాక ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
కార్తిక మాసం కారణంగా వ్యాపారం బాగా తగ్గింది. డ్రస్సుడ్ చికెన్ ధర గతంలో రూ.230 ఉండగా ప్రస్తుతం రూ.135కు పడిపోయింది. మరో పది రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నాం. ప్రస్తుతం ధర తగ్గినప్పటికీ వ్యాపారం మాత్రం పుంజుకోవడం లేదు. గతంలో ప్రతి రోజు రూ.20వేల వరకు వ్యాపారం సాగితే నేడు రూ.10వేలు కూడా సాగడం లేదు. దుకాణంలో పనులు లేక వర్కర్స్ ఖాళీగా ఉంటున్నారు.
– గంట సైదులు, చికెన్ సెంటర్ యజమాని, నేరేడుచర్ల