మిర్యాలగూడ, ఆగస్టు 4 : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధి నుంచి వివిధ మండలాలకు సాగు నీరు అందించేందుకు వరద కాల్వను నిర్మించారు. ఈ కాల్వ ద్వారా పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, తిప్పర్తి, మాడుగులపల్లి, వేములపల్లి మండలాల్లోని సుమారు 80 చెరువులను నింపడంతోపాటు 80వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన ఈ వరద కాల్వ ప్రస్తుతం అధ్వానంగా మారింది.
కంపచెట్లు పెరిగి పూడిపోయింది. మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ వరద కాల్వ కింద 81వ ప్యాకేజీలో 27 డిస్ట్రిబ్యూటరీలు, 110వ ప్యాకేజీలో 15 డిస్ట్రిబ్యూటరీలతోపాటు తూములు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 570 అడుగులు నీటి మట్టం దాటగానే ఈ వరద కాల్వకు నిరంతరాయంగా నీళ్లు వెళ్లే విధంగా నిర్మాణం చేశారు.
గతేడాది గడ్డుకాలం
కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తుండడంతో పై నుంచి వస్తున్న వరదతో సాగర్ డ్యామ్ నిండు కుండలా మారింది. ఆదివారం 571 అడుగులు నీటి మట్టం దాటింది. దీంతో ఆయకట్టు పరిధిలోని చెరువులు నింపేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి సాగర్ నీటిని ముందుగా చెరువులు నింపేందుకు వినియోగిస్తామని ప్రకటించారు.
కానీ వరద కాల్వ పూడిపోయి అధ్వానంగా ఉండడంతో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దాంతో పలు గ్రామాలు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కరువు కారుణంగా 80 చెరువులు నీళ్లు లేక ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి పంటలకు తీవ్ర ఇబ్బంది ఏ్పడింది. ప్రభుత్వం ముందస్తుగా కాల్వకు మరమ్మతులు చేయించి చెరువులు నింపాలని రైతులు జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు.
కంపచెట్లు తొలగించి చెరువులు నింపాలి
గత తొమ్మిదేండ్లుగా వరదకాల్వ ద్వారా మా చెరువులు నిండినయి. గతేడాది కరువు కారణంగా నీళ్లు రాలేదు. ఈ ఏడు సాగర్ ప్రాజెక్టు తొందరగా నిండింది. కానీ కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. కాల్వలు పూడిపోయి, కంపచెట్లు మొలిచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వెంటనే మర్మతులు చేయించి చెరువులకు, పంటలకు నీళ్లు అందించాలి.
-కొత్తగుళ్ల సైదులు, తోపుచర్ల, మాడ్గులపల్లి