చివ్వెంల, ఆగస్టు 1 .: సినీ పక్కీలో ఓ కుటుంబాన్ని పోలీస్సైరన్ చేసుకుంటూ వెంబడించారు. కారు అద్దాలు పగుల గొట్టారు. పెప్పర్ స్ప్రే కొట్టి కోదాడకు చెందిన కిట్స్ కాలేజీ చైర్మన్ నీలా సత్యనారాయణతో పాటు అతడి కుటుంబ సభ్యులపై హత్యా యత్నం చేసిన ఘటన మండలంలోని గుంపుల వద్ద జాతీయ రహదారి 65పై గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… జూలై 31న రాత్రి 12 గం టల తర్వాత సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి కోదాడకు బయలు దేరారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై కొందరు వ్యక్తులు కారు(ఏపీ 39 1116) ఎంజీ హెక్టారలో వచ్చి అడ్డగించారు.
ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేటకు చెందిన తుమ్మెపల్లి మల్లికార్జున్ (ఆర్టీవో), కృష్ణదత్ మరికొందరు వ్యక్తులు కలిసి నీలా సత్యనారాయణతో పాటు ఆయన కుటుంబసభ్యులపై పెప్పర్ స్ఫ్రే కొట్టి దాడి చేశారు. సత్యనారాయణ ఫోన్ లాక్కెళ్లారు. ఈ దాడిలో సత్యనారాయణతోపాటు అతడి తల్లి అరుణాదేవి, సోదరి బిందుపావణిల ముఖంపై ఇతర చోట్ల గాయాలయ్యాయి. రమణారెడ్డి, శ్రీనివాస్, కేపీబీవీ కుమార్, కందుకూరి మహేందర్తో పాటు మరికొందరుపై కూడా అనుమానం ఉందని బాధితులు తెలిపారు. తమపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి కూతురు నీలా విద్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు.