జిల్లాలో దొంగలు మళ్లీ బీభత్సం సృష్టిస్తున్నారు. నిత్యం చోరీలు, దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. రోజుకో ఊరిలో దొంగతనాలు చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. వేసవిలో వరుస చైన్‌స్నాచింగ్, దొంగతనాలు జరగ్గా, ఓ ముఠా అరెస్ట్‌తో మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు దొంగలు మళ్లీ తడాఖా చూపిస్తున్నారు. బస్సులు, బస్టాండ్లలో పర్సులు, సెల్ఫోన్లు, బైక్‌లు అపహరిస్తున్నారు. నిందితుల గుర్తింపు, సొత్తు రికవరీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. నాన్‌స్టాప్ ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి.
బీఆర్ఎస్ హయాంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడా దొంగతనాలు, చైన్‌స్నాచర్లు పెద్దగా కనిపించేవి కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో క్రైం రేట్ పెరుగుతూ వస్తున్నది. గత ఆరు నెలలుగా దొంగతనాలు, చోరీల్లో జిల్లా అగ్రస్థానంలో నిలుస్తున్నది. వేసవిలో వరుసగా చైన్ స్నాచర్లు జరిగాయి. ఆరు బయట పడుకున్నా, మిద్దె మీద నిద్రించినా, ఇంట్లో ఉన్నా పెద్ద ఎత్తున దొంగతనాలు జరిగాయి. దీంతో పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా గస్తీ కాశారు. ఆఖరికి ఓ ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు. దాంతో కొన్ని రోజులుగా దొంగతనాలు పెద్దగా కనిపించలేదు. కానీ ఇటీవల మళ్లీ దొంగలు చెలరేగిపోతున్నారు. సెల్ షాపులు, మూసి ఉన్న దుకాణాలు, ఇండ్లు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు.
బస్టాండ్లలో సైతం యథేచ్ఛగా చోరీలు జరుగుతున్నాయి. బస్సులు రద్దీగా ఉంటుండటంతో దొంగలు తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు. బస్సుల్లో పర్సులు, సెల్ఫోన్లు కొట్టేస్తున్నారు. బాధితులు మాత్రం ఫిర్యాదులు చేయకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చోరీలు ఇటీవల పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ బస్టాండ్లలో పదుల సంఖ్యలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు బైక్‌లు సైతం మాయమవుతున్నాయి.
వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. దొంగలు పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నెలలు దాటుతున్నా గుర్తించలేకపోతున్నారు. దీంతో పోయిన సొత్తు, బంగారం రికవరీ కావడంలేదు.
భువనగిరి మున్సిపాలిటీలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు పదేపదే సూచిస్తున్నారు. కానీ అనేక చోట్ల సీసీ కెమెరాలు ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని ఒకటి, రెండు కాలనీల్లో మినహా ఎక్కడా పనిచేయడంలేదని తెలుస్తున్నది. దీని పర్యవేక్షణ కూడా గాలికి వదిలేశారు. మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జోక్యంతో సీసీ కెమెరాల కాంట్రాక్టు ముందుకు సాగుడం లేదనే ప్రచారం జరుగుతున్నది.