భువనగిరి అర్బన్, ఆగస్టు 23 : దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ, పవిత్ర యాదగిరి గుట్ట దేవాలయం మాఢ వీధుల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బృందం రాజకీయపరమైన శుద్ధి కార్యక్రమం చేసినందుకు చట్టపరమైన కేసులు నమోదు చేయాలని కోరుతూ శుక్రవారం భువనగిరిలో డీసీపీ రాజేశ్‌చంద్రకు డీసీపీ డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసన సభ ఎన్నికల సమయంలో భువనగిరిలో జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆగస్టు 15లోపు రైతులు బ్యాంకుల్లోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి లక్ష్మీనర్సింహ స్వామిపై ఒట్టు వేశాడని అన్నారు.
ఆయన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రాష్ట్రంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ జరుగలేదని, దేవుడిపై వేసిన ఒట్టు ప్రకారం మాట తప్పాడని, దాంతో పాలకులు చేసే తప్పిదాలకు ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరుగలేదని రాష్ట్ర మంత్రులే చెబుతున్నారని, వారు చెప్పే మాటలు ఒకరికి ఒకరికి పొంతనలేని విధంగా ఉన్నాయని, మొత్తం రుణమాఫీకి రూ.46వేల కోట్లు కావాల్సి ఉండగా మూడు విడుతల్లో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, పూర్తి స్థాయిలో ఎక్కడ జరిగిందో చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుతోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్మీనర్సింహ స్వామికి ఇచ్చిన మాట తప్పాడని, దాంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టవద్దని లక్ష్మీనర్సింహ స్వామికి ప్రత్యేక పూజలు చేయించి వేడుకున్నామని, దేవుడిని వేడుకోవడం తప్పా అని తెలిపారు.
దేవుడిని దర్శించుకోవడం, మాఢ వీధుల్లో తిరుగడం తప్పని, అదేరోజు సాయంత్రం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నడిచిన ప్రాంతంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు యాదగిరిగుట్ట మండల, పట్టణానికి చెందిన మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, ఆ పార్టీ నాయకులు ఎరుకల హేమేందర్‌గౌడ్, గౌళికార్ రాజేశ్, కాటబత్తిని ఆంజనేయులు, దుంబాల వెంకట్‌రెడ్డి, గుండు నర్సింహగౌడ్, గుండ్లపల్లి భరత్‌గౌడ్, గుడిపాటి మధుసూన్‌రెడ్డి కొండ కింది భాగం నుంచి 5 ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను యాదాద్రి కొండపైకి దేవస్థానం అనుమతులు లేకుండా తీసుకొచ్చారని తెలిపారు. కొండపైన రాజకీయపరమైన శుద్ధి కార్యక్రమం చేపట్టారని అన్నారు. ప్రైవేట్ వాహనాలు కొండపైకి రావాలంటే రూ.500 వందల టికెట్ తీసుకుంటారని, కానీ ఎలాంటి అనుమతి లేకుండా, రుసుం చెల్లించకుండా కొండపైకి వాటర్ ట్యాంకర్లను ఈఓ ఎలా పైకి అనుమతించారని తెలిపారు.
ఆలయ నిబంధనల ప్రకారం సూర్య, చంద్రగహణాలు పట్టినప్పుడు, ఆలయ పరిసరాల్లో అపశ్రుతి సంభవించినప్పుడు మాత్రమే శుద్ధి కార్యక్రమం చేస్తారని, అదికూడా అర్చకుల పూజలతో ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం దేవాయల సిబ్బంది చేపడుతారని చెప్పారు. దేవాలయ పరిసరాల్లో రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం సెక్షన్ 192, 352, 353 బీఎన్ఎస్ సెక్షన్లతో వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతునామని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బీఆర్ఎస్ యాదగిరి గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, చొల్లేరు మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, బీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, ఆలేరు వ్యవసాయ మారెట్ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి తదితరులున్నారు.