నిడమనూరు : నిడమనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. స్టోర్ రూమ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామాగ్రికి అంటుకోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించింది. భవనంలో నిద్రించిన వాచ్ మెన్, సిబ్బంది మేల్కొని పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఏఎస్ఐ కే జోజి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు.
మంటలు వ్యాపించి భవనం లోపలి గదుల్లోని ఐఎల్ఆర్ ఫ్రిజ్లు, బెడ్లు, రిఫ్రిజిరేటర్లు, మందులు, విలువైన ఫైళ్ళు, కంప్యూటర్లు, ప్రింటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఆరోగ్య కేంద్రం వద్దకు చేరుకుని మంటలను రెండు గంటలపాటు శ్రమించి అదుపు చేశారు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో కేసా రవి ఆరోగ్య కేంద్రానికి చేరుకుని ప్రమాదం తీరును పరిశీలించారు. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు వైద్యాధికారి డాక్టర్ అరవింద్ తెలిపారు.