సూర్యాపేట, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : జిల్లా ను రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలసి కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులతో గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ, తెలంగాణ రాష్ట్రీయ గీతాలాపన చేసిన అనంతరం మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడంలో ప్రభుత్వం ముందుకెళ్లుందన్నారు. మహాలక్ష్మి పథకంలో రూ.3కోట్ల 48లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని పొంది రూ.191.78లక్షల మొత్తాన్ని ఆదా చేసుకున్నారని చెప్పారు. సన్న వడ్లకు రూ.25కోట్ల 41లక్షలను బోనస్‌గా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లాలో 3లక్షల 26వేల 57ఆహార భద్రత కార్డుదారులు అందించామన్నారు.
రూ.33కోట్ల 83లక్షలతో పాలకీడు మండలం, బెట్టతండా వద్ద మూసీ నదిపై బెట్టతండా ఎత్తిపోతల పథకం, రూ 47.64లక్షలతో కోదాడ మండలం రెడ్లకుంట వద్ద పాలేరు వాగు నుంచి రెడ్లకుంట మేజర్ కాలువకు రెడ్లకుంట ఎత్తి పోతల పథకానికి నిధులు మంజూరు చేశామన్నా రు. రూ. 5కోట్ల 30లక్షలతో అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద పాలేరు వాగుపై ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ చేశామన్నారు. రూ. 37.70లక్షలతో చింతలపాలెం మండలం నక్కగూడెం ఎత్తిపోతల పథకంలో పంపులు, మో టార్ల మరమ్మతులు చేశామన్నారు. నాగార్జునసాగర్ ఎడమకాలువ లైనింగ్ పనులకు రూ. 29 కోట్లు, బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రూ. 184.60లక్షలు, జాన్‌పహాడ్ బ్రాంచి కెనాల్ లైనిం గ్ పనులకు రూ.52కోట్ల 11లక్షల నిధులు మం జూరై పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మూ సీ కాలువ ఆధునీకరణకు రూ.88కోట్ల 76లక్షల అంచనా వ్యయంతో మంజూరు కాగా నేటి వరకు రూ. 56కోట్ల 17లక్షల పనులు జరిగాయన్నారు.
సూర్యాపేట జిల్లాను నిరంతర అభివృద్ధి చేస్తామని చెప్పారు. జిల్లాలో 12,868 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 1050 నిర్మాణంలో ఉన్నాయన్నారు. విద్యాశాఖ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, భూ భారతి, వైద్యారోగ్యశాఖ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ జనరల్ దవాఖాన సేవలు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, పరిశ్రమలు, పీఎంఈజీపీ, రవాణా, గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, శాంతిభద్రతలు తదితర శాఖ ల్లో జరుగుతున్న పనుల ప్రగతిని ప్రజలకు వివరించారు. కోదాడ, హుజుర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, కోదాడకు జవహర్ నవోదయ విద్యాలయం, హుజూర్‌నగర్‌కు వ్యవసాయ కళాశాల మంజూరు చేయించామన్నారు. దేవాదులతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతరం ఆయా శాఖల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్క్యతిక కార్యక్రమాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీక్షించి ప్రతిఒక్కరితో ఫొటోలు దిగారు. జిల్లాలో ని స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాం బాబు, జడ్పీసీఈవో అప్పారావు, ఆర్డీవో వేణు మాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పది, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యర్థులకు కలెక్టర్ నంద్లాల్ పవార్ రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు.