టీఆర్ఎస్లో చేరిన మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి
పోరెడ్డి ముత్తారెడ్డి.. 1957 నుంచి సీపీఐ సభ్యుడు. 13 ఏండ్లపాటు గట్టుప్పల్ సర్పంచ్ కూడా. ఈ నెల 25 వరకు సీపీఐ క్రియాశీలక కార్యకర్త అయిన ముత్తారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టుప్పల్ మండలం ఏర్పాటుచేయడంతో కృతజ్ఞతగా గులాబీ కండువా కప్పుకొన్నారు. 65 ఏండ్ల కమ్యూనిస్టు జీవితానికి స్వస్తి పలికి మండలం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ముత్తారెడ్డి మాట్లాడుతూ.. కొత్త మండలాలు, గ్రామపంచాయతీలతో పాలనను ప్రజల వద్దకు తెచ్చిన గొప్పతనం కేసీఆర్‌దేనన్నారు. ఎన్నో ప్రభుత్వాలను చూసినా, కేసీఆర్ వంటి పాలన ఎవ్వరూ అందించలేదని కొనియాడారు.
జనం అడుగకపోయినా ఏది అవసరమో గుర్తించి ఇస్తున్నారని చెప్పారు. కేసీఆర్ చలువతోనే తాను కూడా 3 వేల రూపాయల వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆసరా పింఛన్‌తో తన లాంటి వాళ్లకు కేసీఆర్ ఎంతో ధైర్యం ఇస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఆడబిడ్డల పెండ్లికి చేస్తున్న సాయం చాలా గొప్పవన్నారు. ఇన్ని మంచి పథకాలతోపాటు ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అయిన గట్టుప్పల్‌ను మండలం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తమ పోరాటాన్ని గుర్తించి మండలం ఇచ్చిన కేసీఆర్ వెంటే ఉంటామని ముత్తారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. ముత్తారెడ్డిలాగే గట్టుప్పల్‌లో ఎవరిని కదిలించినా కేసీఆర్ వల్లే మండలం వచ్చిందని చెప్తున్నారు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఎవరికీ అభ్యంతరం లేకుండా ఏర్పాటు చేయడం గొప్ప విషయమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.