సూర్యాపేట సిటీ, జూలై 10 : పీడీఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేసే వారి నిల్వ స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని, వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదు చేసి 689 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్ చేశామని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా ఆంధ్రా ప్రాంతాల్లో కూడా దర్యాప్తు చేసి పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పేదల కోసం పీడీఎస్ బియ్యం అందిస్తున్నదని, వీటిని పక్కదారి పట్టించినా, రీ సైక్లింగ్ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బియ్యం అక్రమ రవాణాను క్షేత్రస్థాయిలో అరికట్టడానికి సంబంధిత అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని, ప్రజా పంపిణీ వ్యవస్థకు బియ్యం అందించే మిల్లర్లు, అంతర్రాష్ట్ర ట్రాన్స్పోర్ట్స్పై పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి రేషన్ డీలర్లు, మిల్లర్లు బాధ్యతగా పని చేయాలని పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారంపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, అంతర్రాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.