
ఇంక్విలాబ్ ఫౌండేషన్, రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్ ఆధ్వర్యంలో స్కూల్స్ ఇన్నోవేషన్ చాలెంజ్ పోటీలను 2020 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్య పాఠశాలల్లో 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఒక యాక్టివ్ టీచర్ ఏ సబ్జెక్ట్ వారైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులకు సూచించింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సైతం ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లాలో అన్ని పాఠశాలలు రిజిస్ట్రేషన్‌కు ముందుకు వచ్చాయి. జిల్లాలో 6-10వ తరగతులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 237 ఉండగా..అన్ని పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. నవంబర్ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్లకు గడువు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలలు ఇన్నోవేషన్ చాలెంజ్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. నల్లగొండ జిల్లాలో 401 పాఠశాలలకు 149 పాఠశాలలు, సూర్యాపేట జిల్లాలో 287 పాఠశాలలకు 151 పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయి. నూరు శాతం రిజిస్ట్రేషన్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇతర జిల్లాల్లో చాలా పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో వారికి మరోసారి అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆయా పాఠశాలలు చొరవ చూపుతున్నాయి.
వివిధ దశల్లో ఉత్తమ ప్రదర్శనల ఎంపిక
జనవరిలో జిల్లా స్థాయి, ఫిబ్రవరిలో రాష్ట్రస్థాయి ప్రదర్శన హైదరాబాద్‌లో జరుగనుండగా ఉత్తమ ప్రదర్శనల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో జరుగనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆన్లైన్ మాడ్యూల్‌ను పూర్తిచేసి ఇప్పటికే సర్టిఫికెట్లు పొందారు. టీచర్లకు ఆన్లైన్లో శిక్షణ నిర్వహించిన తర్వాత విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఆన్లైన్ కోర్సు ప్రక్రియను నిర్వహిస్తారు. 1-5 వరకు గ్రూపులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండగా.. ఒక్కో గ్రూపులో 2-4 వరకు విద్యార్థులు ఉండవచ్చు. మొత్తంగా ఒక్కో పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. వీరు ఆన్లైన్లోనే ఐడియాను పంపిన తర్వాత ఇన్నోవేషన్ బృందం సభ్యులు ప్రతి జిల్లాకు ఐదు ప్రదర్శనలను ఎంపిక చేస్తారు. వీరి ఐడియాలకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో వారం రోజులపాటు నిర్వహించే ప్రత్యేక శిక్షణలో ప్రదర్శనలకు కార్యరూపం ఇస్తారు. వీటిని రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించి అంతిమంగా విజేతలను నిర్ణయిస్తారు.
గతేడాది స్ఫూర్తితో..
గత యేడాది నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో రాష్ట్రస్థాయికి 125 ఆలోచనలు ఎంపికకాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పది ఆలోచనలు ఎంపికయ్యాయి. చివరకు ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థినులు రూపొందించిన ఆర్గానిక్ జీరో వేస్ట్ స్త్రీ రక్ష శానిటరీ ప్యాడ్ చాంపియన్ షిప్‌గా నిలిచింది. ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా విద్యార్థినులు బహుమతిని అందుకున్నారు. ఈ సారి ఆవిష్కరణలు రూపొందించే విద్యార్థుల సంఖ్య కూడా గత ఏడాది కంటే ఎక్కువగానే ఉండనుండగా.. జిల్లా గత కీర్తినే కొనసాగించేలా విద్యాశాఖ ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
విద్యార్థులకు మంచి అవకాశం
వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు రూపొందించేందుకు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ ఇది మంచి అవకాశం. పోర్టల్ రిజిస్ట్రేషన్లలో అన్ని పాఠశాలలు పాల్గొని రాష్ట్రంలోనే రికార్డును నెలకొల్పడం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రదర్శనల్లో సత్తా చాటేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ఆన్లైన్ శిక్షణను ఇవ్వనున్నాం.
సృజనాత్మకతను ప్రోత్సహించేలా..
బట్టీ చదువులకు అలవాటు చేయకుండా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ చూపాలి. గతేడాది జిల్లాకు చెందిన విద్యార్థులు చాంపియన్ షిప్‌గా నిలిచారు. ఈ సారి కూడా అదే ఒరవడిని కొనసాగించేలా ఉపాధ్యాయులను, విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.