సూర్యాపేట, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : పన్నెండేండ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో పలు మిల్లుల నుంచి పౌర సరఫరాల శాఖ ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని కోదాడలోని ఓ మిల్లులో భద్రపరిచి సీజ్ చేసింది. ఆ తర్వాత అటువైపే చూడలేదు. దాంతో అవి నేడు తుట్టెలు కట్టి, పురుగులు పట్టి నేలపాలయ్యాయి. వాటి విలువ నాడు సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది ఈ ఉదంతం. సుమారు రూ.50 లక్షల విలువ చేసే ధాన్యం పురుగులు పట్టి పనికిరాకుండా పోతే అది ఎక్కడ అనే విషయం సంబంధిత శాఖకే తెలియదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

2012 సంవత్సరంలో కోదాడకు చెందిన జేవీ రామారావు ప్యాడి రైస్ మిల్, ఫుడ్ గ్రేన్స్ అండ్ జనరల్ మర్చంట్స్ కోదాడ వారి నుంచి సుమారు 22వేల క్వింటాళ్ల ధాన్యాన్ని అప్పటి పౌర సరఫరాల అధికారులు సీజ్ చేశారు. మిల్లులో ఉన్న రెండు రకాల ధాన్యం, నూకలు సీజ్ చేసి కోదాడలోని అదే మిల్లులో భద్రపరిచి షెడ్‌తోపాటు ధాన్యాన్ని సీజ్ చేశారు. తదనంతరం మిల్లులో సీజ్ చేసినంత వరకు వదిలేసి మిగిలిన స్థలంలో సీతారామమ్మ ఫంక్షన్ హాల్‌గా మార్చినట్లు తెలిసింది. సీజ్ చేసిన ధాన్యం విలువ దాదాపు నాటి ధరల ప్రకారం రూ.50 లక్షల వరకు ఉన్నట్లు గతంలో అక్కడ పనిచేసి వెళ్లిన ఓ అధికారి ద్వారా తెలిసింది.
అయితే ఇది జరిగి 12 సంవత్సరాలు గడిచి పోగా సీజ్ చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు అతీగతీ లేదు. ఏనాడూ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. దాంతో ధాన్యం పూర్తిగా పాడై మట్టికొట్టుకు పోతున్నది. సదరు మిల్లు నుంచి ప్రభుత్వానికి బాకీ ఎంత ఉందో తెలియదు కానీ షెడ్డు కూడా శిథిలావస్థకు చేరుకున్నా సంబంధిత వ్యక్తులు కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. సీజ్ చేసిన ధాన్యంపై నమస్తే తెలంగాణ ఆరా తీసింది. అసలు ఈ ధాన్యాన్ని ఎందుకు సీజ్ చేశారు..? మిల్లు వారు అక్రమాలకు పాల్పడ్డారా..? లేక మరేదైనా జరిగిందా? అనే విషయం రాబట్టే ప్రయత్నం చేయగా తెలియరాలేదు. ఒకవేళ నాడు మిల్లుపై కేసు నమోదైతే అదేమైందో ప్రస్తుత ఎవరికీ తెలియని అంశంగా మారింది.